పహాణీలో ట్యాంపరింగ్​కు 40 లక్షల డీల్

పహాణీలో ట్యాంపరింగ్​కు  40 లక్షల డీల్
  • సూర్యాపేటలో ధరణి అక్రమాల్లో నివ్వెరపోయే నిజాలు!
  • పట్టా లేని భూములను ధరణిలో చేర్చేందుకు రెవెన్యూ ఆఫీసర్ల పన్నాగం
  • మిస్సింగ్​ సర్వే నంబర్లను చేర్చే మాడ్యూల్​ను ఇందుకు వాడుకునే ప్లాన్​
  • 11 మందికి 27 ఎకరాలకు పట్టాలు ఇచ్చేలా 
  • మోతె తహసీల్దార్ ఆఫీసులో రూ.40 లక్షలకు  ఒప్పందం
  • ఇది సక్సెస్​ అయితే మరో 35 ఎకరాలకు ఇవ్వాలని స్కెచ్​
  • రికార్డుల ట్యాంపరింగ్​ కోసం ఐదుగురితో స్పెషల్​ టీమ్ 
  • కలెక్టర్​ అలర్ట్​గా ఉండడంతో పారని పాచిక
  • తహసీల్దార్​ సహా 21 మంది అరెస్ట్.. రిమాండ్​కు తరలింపు


సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో భారీగా ధరణి అక్రమాలు వెలుగుచూశాయి. మోతె తహసీల్దార్ ఆఫీసు కేంద్రంగా జరిగిన పహాణీల ట్యాంపరింగ్​లో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. పహాణీలను ట్యాంపరింగ్​ చేయడం ద్వారా కలెక్టర్​నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయగా, ఆయన అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ బాగోతం బట్టబయలైన విషయం తెలిసిందే.  ఈ కేసులో  ఇప్పటికే తహసీల్దార్ సంఘమిత్ర, ముగ్గురు ఆర్ఐలు, మోతె మీ సేవ ఆపరేటర్, ఇద్దరు వీఆర్వోలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ సహా 21 మంది కటకటాల్లోకి వెళ్లగా, కలెక్టర్​, పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.

తహసీల్దార్​ ఆఫీసులోనే డీల్ 

మోతె మండలంలోని సిరిపురం, రాఘవపురం, మోతె, నామవరం గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా వారి వద్ద ఎలాంటి పాస్​బుక్​లు లేవు. సాదాబైనామా కింద  భూములు కొనుగోలు చేయడం వల్ల ఆఫీస్​రికార్డుల్లో పాత పట్టాదారుల పేర్లే ఉన్నాయని,  వాటిని తమ పేరిట మార్చాలని  కొన్నాళ్లుగా వీరంతా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు.  

ఈక్రమంలో మోతె మీ సేవా ఆపరేటర్ నాగరాజును సంప్రదించగా, తాను రెవెన్యూ అధికారులతో మాట్లాడుతానని, ఇందుకు భారీగా ఖర్చవుతుందని చెప్పాడు. రైతులు ఒప్పుకోవడంతో నాగరాజు, తహసీల్దార్ సంఘమిత్ర , ఆఫీసులో పనిచేసే ఆర్​ఐలతో కలిసి మెదడుకు పనిచెప్పారు. 

సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములు కావడం వల్లే ధరణి పోర్టల్ లో నమోదు కాలేదు. దీంతో పహాణీలను ట్యాంపరింగ్​చేసి మిస్సింగ్​సర్వే నంబర్లను  చేర్చే మాడ్యూల్​ద్వారా ధరణిలోకి ఎక్కించాలని ప్లాన్​వేశారు. అంతా ఒకే అనుకున్నాక మొత్తం11 మంది రైతులకు సంబంధించి 27 ఎకరాల భూములను ధరణిలో చేర్చేందుకు రూ.40 లక్షలకు డీల్​ కుదుర్చుకున్నారు.  

ఐదుగురితో స్పెషల్​ టీమ్ 

మిస్సింగ్​సర్వే నంబర్లను చేర్చే మాడ్యూల్​ ద్వారా ధరణిలో ఆయా భూములను చేర్చాలంటే ముందుగా పాత పహాణీలు సృష్టించాలి. ఇందుకోసం పహాణీల ట్యాంపరింగ్ తో పాటు  నకిలీ పాస్ బుక్స్​తయారుచేయాల్సి వచ్చింది. దీంతో రికార్డులు ట్యాంపరింగ్, నకిలీ పాస్​బుక్​ల తయారీలో అనుభవమున్న టీమ్​ను సంప్రదించారు. ఇద్దరు మాజీ వీఆర్వోలు, మీ సేవా ఆపరేటర్,  ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ టీమ్​లో ఉన్నారు. 

వీరంతా కలిసి ఎలాంటి అనుమానం రాకుండా 11 మంది రైతులకు చెందిన 27 ఎకరాలకు సర్వే నంబర్ల వారీగా పహాణీలు రూపొందించి, వాటికి నకిలీ పాస్​బుక్​లు సృష్టించారు. వీటిని తహసీల్దార్ సంఘమిత్ర, ఆర్ఐ అజయ్​వెరిఫై చేసి, కలెక్టర్ లాగిన్ కు పంపించారు. అనుమానం వచ్చిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నేరుగా మోతె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించగా.. ఏకంగా 11 ఫైల్స్ కు సంబంధించిన రికార్డులు ట్యాంపరింగ్ అయినట్లు గుర్తించారు. 

మొదట ఇద్దరు ఆర్ఐ లను సస్పెండ్ చేసిన ఆయన పూర్తి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని సూర్యాపేట ఆర్డీవో ను ఆదేశించారు. రికార్డులను తనిఖీ చేసి ట్యాంపరింగ్ జరిగినట్టు నిర్ధారించిన ఆర్డీవో..  మోతె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితమే మోతె తహసీల్దార్ సంఘమిత్రను కలెక్టర్​ సస్పెండ్​ చేయగా, శనివారం సంఘమిత్ర, ముగ్గురు ఆర్ఐలు, మోతె మీ సేవా ఆపరేటర్, ఇద్దరు వీఆర్వోలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ సహా 21 మంది పై  52/ 2025 యూఎస్318(4), 336(3), 340(2), 316(5), ఆర్/ డబ్ల్యూ 3(5), బి.ఎన్.ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్​కు పంపించారు. 

కాగా, ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేసిన ఎంక్వైరీలో మరికొన్ని ఆసక్తికకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 11 మందికి 27 ఎకరాల భూములు ధరణిలోకి ఎక్కగానే  మరో 35 మందికి పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు స్కెచ్​ వేశారు. ఈ మేరకు వారి నుంచి కూడా డీల్​కుదుర్చుకున్నట్టు తెలిసింది. 

మోతె తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేసినపుడు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అనుమానంతో గతంలో పని చేసిన ఆర్ఐ అజయ్ కుమార్ ఫోన్ పే రికార్డ్  బయటకు తీశారు. వివిధ సందర్భాల్లో రైతుల నుంచి  75 సార్లు ఫోన్ పే ద్వారా అమౌంట్ ట్రాన్​సాక్షన్​ అయినట్లు  గుర్తించారు. 

ఇలాంటి పక్కా ఆధారాలతోనే రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ ఉచ్చు బిగిసినట్లు తెలిసింది. కాగా, మిస్సింగ్​ సర్వే నంబర్లను చేర్చేందుకు ధరణిలో ఉన్న ఈ మాడ్యూల్​ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ మాడ్యూల్​ ద్వారా కొత్తగా చేర్చిన సర్వే నంబర్లపై సర్కారు ఎంక్వైరీకి ఆదేశించే అవకాశముందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.