- అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- మంత్లీ టార్గెట్లతో ముందుకు వెళ్లాలి
- జీఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలి.. పక్కాగా ఆడిట్ చేపట్టాలి
- ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ సేల్స్ పెరిగినా ఆ మేరకు రాబడి ఏది?
- కమర్షియల్ ట్యాక్స్‌లో మంచి గ్రోత్.. మరింత బాగా పని చేయాలి
- 3 నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.29 వేల కోట్లు.. ఇంకా పెరగాల్సింది
- నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఆదాయం తెచ్చే డిపార్ట్మెంట్లన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పన్ను ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకూడదని, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని చెప్పారు.
‘‘ట్యాక్స్ ఎగవేతదారులపై చర్యలు తీసుకోండి. ఎంతవారున్నా వదిలిపెట్టొద్దు. ఈ విషయంలో అధికారులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు” అని సీఎం స్పష్టం చేశారు. వార్షిక లక్ష్యానికి తగ్గట్టు ప్రతి డిపార్ట్మెంట్ నెలవారీగా టార్గెట్లను తయారు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు.
ట్యాక్స్ వసూళ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో అవసరమైతే సంస్కరణలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సెక్రటేరియెట్‌లో సమీక్ష నిర్వహించారు.
ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ మీటింగ్‌లో వివిధ అంశాలను చర్చించారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎంచుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదన్నారు. మూడు నెలల్లో దాదాపు రూ.29 వేల కోట్లు వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.2 వేల కోట్లు మాత్రమే ఎక్కువ అని సీఎం తెలిపారు.
ఇది దాదాపు ఇంకో 30 శాతం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకా నెలా మంత్లీ టార్గెట్‌ను నిర్దేశించుకొని, రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏవియేషన్ ఇంధనంపై పన్ను వసూలు సవరణ!
ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నెలవారీ సమీక్షతో పాటు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని ఆయన చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలన్నారు. పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు.
ఓవరాల్‌గా చూస్తే కమర్షియల్ టాక్స్‌లోనే ఈ మూడు నెలల్లో ఆదాయం భారీగా పెరిగిందన్నారు. గతంతో చూస్తే మొదటి క్వార్టర్లో ఏకంగా రూ.1,600 కోట్లు అదనంగా రాబట్టడంపై అధికారులను సీఎం అభినందించారు.
రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గడమేంది?
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాదితో చూస్తే తగ్గింది. అయితే.. పెరగాల్సిన రాబడి తగ్గడంపై అధికారులను సీఎం వివరణ అడిగారు. మూడు నెలల్లో రూ.3,489 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లలో రాబడి వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది.
ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో అటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయని, ఇటు గృహ నిర్మాణాలు కూడా అదే వరుసలో పుంజుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని.. అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించేందుకు పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయటం ద్వారా వాహనాల అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా.. అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
అక్రమ మద్యంపై నిఘా
ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అసలు ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతున్నదని ఆయన అడిగారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో కేవలం రూ.379 కోట్లు పెరగడం ఏమిటని ఆయన అన్నట్లు సమాచారం. ఎక్సైజ్ డ్యూటీ కింద గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో రూ. 4,405 కోట్లు రాగా.. ఈసారి రూ.4,784 కోట్లు వచ్చాయి.
డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పడుతున్నట్లు, పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నదని సీఎం సీరియస్ అయినట్లు తెలిసింది. మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని సమావేశంలో చర్చ జరిగింది.