- సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు
కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి నుంచి కర్జెళ్లి వెళ్లే మెయిన్ రోడ్ పక్కన ఉన్న రైతుల భూముల్లో రెవెన్యూ సర్వే అధికారులు, మంగళవారం ఉదయం సర్వే చేయడానికి వెళ్లగా... వారిని రైతులు అడ్డుకున్నారు. పట్టాదారు రైతులు అక్కడకు చేరుకుని ల్యాండ్ సర్వే ఏడీ సోమేశ్వర్, మండల సర్వేయర్ శ్రీనివాస్, అధికారులను ఎందుకు సర్వే చేస్తున్నారని నిలదీశారు. మొదట స్థానిక సర్వేయర్ శ్రీనివాస్ రైతులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఏ రైతుకు నోటీస్ ఇచ్చారో చూపించాలని పట్టుబట్టారు. కొందరు రైతులకు నోటీసులు ఇచ్చినట్లు సర్వేయర్ చూపించారు. అందులో సంతకాలు తమవి కాదని, నోటీస్ పేపర్లు మొత్తం చూపించాలని పట్టుబట్టారు.
అధికార పార్టీ నాయకులకు మేలు చేసేందుకే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మెయిన్ రోడ్ పక్కన దళితుల భూమి ఉండడంతో రాజకీయ నాయకులు తమకి అడ్డు లేకుండా చేసేందుకే సర్వే చేయిస్తున్నారని రైతులు రౌతు లులాజి, తిరుపతి, లాట్కరి పుల్లయ్య, లాట్కారి మహేష్, లాట్కారి పోశన్న సర్వే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే సర్వే చేస్తామని అధికారులు వెనుదిరిగారు. విషయంపై తహసీల్దార్ అలీనీ వివరణ కోరగా ఎక్కడా ఎలాంటి గొడవ జరగలేదని, సర్వేలతో తనకు సంబంధం ఉండదని, ఆ శాఖ వేరే ఉంటుందని చెప్పడం గమనార్హం .