- మూడు రోజుల పాటు నిర్వహణకు షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ –2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను మరోసారి వెరిఫై చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఈ ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లాల వారీగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి షెడ్యూల్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్ దోమలగూడలోని గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. 31 జిల్లాలకు చెందిన 393 మందిని ఈ రీవెరిఫికేషన్‌కు పిలిచామన్నారు.
అభ్యర్థుల స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నట్టు తెలిపారు. 20న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల జిల్లాల నుంచి129 మంది అటెండ్ కానున్నట్టు చెప్పారు. 21న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి 131 మందిని.. 22న నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి తదితర జిల్లాల నుంచి133 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినట్టు వెల్లడించారు.
కాగా, గతంలో ఆన్లైన్లో సర్టిఫికెట్లను పరిశీలించి డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 33 మందిని మాత్రమే ఎంపిక చేశారు. దీంతో పలువురు అభ్యర్థులు తమకు నష్టం జరిగిందని, అర్హత లేనివారికీ ఉద్యోగాలు వచ్చాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు కోర్టునూ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన 33 మందితో పాటు స్పోర్ట్ కోటాలో అప్లై చేసిన అర్హులైన అభ్యర్థులందరినీ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌కు పిలిచారు.