ఓరుగల్లులో టీఆర్‍ఎస్‍ పార్టీకి రివర్స్ గేర్‍

వరంగల్, వెలుగు: ఓరుగల్లులో అధికార టీఆర్‍ఎస్‍ పార్టీకి రివర్స్ గేర్‍ మొదలైంది. ఇన్నేండ్లు ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బడిముబ్బడిగా పార్టీలో చేర్చుకోగా ఇప్పుడు అదే పార్టీని కొందరు వీడుతున్నారు. నియోజకవర్గాల్లో, వ్యక్తిగతంగా ఇమేజ్‍ ఉన్న సీనియర్‍ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‍బై చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లా నుంచి గడిచిన రెండు వారాల్లోనే ముగ్గురు సీనియర్‍ లీడర్లు.. టీఆర్‍ఎస్‍కు రాజీనామా చేశారు. ఇంకొందరు రేపోమాపో అన్నట్లు ఎదురుచూస్తున్నారు. ఇందులో కొందరు టీఆర్‍ఎస్‍ పార్టీ ప్రభావం తగ్గిందని భావిస్తుండగా.. మరికొందరు ఎంత కష్టపడ్డా తమకు గుర్తింపు ఇవ్వట్లేదనే కారణంతో కారు దిగుతున్నట్లు తెలుస్తోంది.

హుస్నాబాద్​లో మారిన సీన్..
హుస్నాబాద్‍ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‍రెడ్డి ఇటీవల టీఆర్‍ఎస్‍ పార్టీకి గుడ్‍ బై చెప్పారు. నియోజకవర్గంలో అధికార పార్టీ క్యాండిడేట్‍ను ఢీకొట్టే బలమైన నేతగా ప్రవీణ్‍రెడ్డికి గుర్తింపు ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‍ గ్రామానికి చెందిన ప్రవీణ్‍రెడ్డి ఆసియాలోనే ఉత్తమ సహకార సంఘాలలో ఒకటైన ములుకనూర్‍ సొసైటీకి 1987 నుంచి అధ్యక్షునిగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్‍ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా.. 2014లో  టీఆర్‍ఎస్‍ క్యాండిడేట్‍ ఒడితల సతీశ్​కుమార్‍ చేతిలో ఓడారు. అనంతరం టీఆర్‍ఎస్‍ పార్టీలో చేరారు. 2018లో టిక్కెట్‍ వస్తుందని ఆశించి, భంగపాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతోనే సొంతగూటికి చేరినట్లు చెబుతున్నారు.

ఆవేదనలో రామచంద్రు..
టీఆర్​ఎస్​కు ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉండే మాజీ ఐఏఎస్‍ ఆఫీసర్‍ రామచంద్రునాయక్‍ తేజావత్‍ ఇటీవల గులాబీ పార్టీని వీడారు. మహబూబాబాద్‍ జిల్లా కురవి మండలం సీరోలుకు చెందిన రామచంద్రునాయక్‍ టీఆర్‍ఎస్‍ పార్టీకి ఢిల్లీ స్థాయిలో వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్‍ నేతగా పేరుంది. పార్టీ ప్రతినిధిగా ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన నీటి ప్రాజెక్టుల అనుమతులు, రైల్వే లైన్లు, నేషనల్‍ హైవేలు, ఎయిమ్స్‍ సెంటర్‍, భద్రాద్రి పవర్‍ ప్రాజెక్ట్ విషయాల్లో తాను అందించిన సేవలను పార్టీ పెద్దలు గుర్తించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేయడం ఆయనకు నచ్చలేదు. పార్టీలో అగ్రకుల నాయకత్వానికే ప్రాధాన్యత ఇస్తున్నారని టీఆర్ఎస్ ను వీడారు. ఇక సీఎం కేసీఆర్‍ మాజీ పీఆర్వో గటిక విజయ్‍కుమార్‍ తమ్ముడు గటిక అజయ్‍ కుమార్‍ సైతం టీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మాజీ ఎంపీపీ, మాజీ ట్రిబ్యునల్‍ మెంబర్​ అయిన అజయ్‍ కుమార్‍ కు బీసీ నేత మంచి పేరుంది. అజయ్‍ తల్లి సుగుణమ్మ జడ్పీటీసీగా పని చేశారు. కాగా, అజయ్‍తో పాటు పలు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కారు దిగారు. గత కొన్ని రోజుల క్రితం నర్సంపేట పట్టణానికి చెందిన యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్‍రెడ్డి సైతం టీఆర్‍ఎస్‍కు రిజైన్‍ చేసి బీజేపీలో చేరారు.

త్వరలో మరో ఇద్దరు..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, ఆటో కార్మిక నేత, అడ్వకేట్‍ గుడిమల్ల రవికుమార్‍ త్వరలోనే కారు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి ప్రదీప్‍రావు బరిలో ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా..హైకమాండ్‍ సూచనతో దయాకర్‍రావు తన తమ్ముడిని పోటీనుంచి తప్పించి నన్నపునేని నరేందర్‍కు సీటు ఇచ్చారు. కాగా, ఎమ్మెల్యేగా గెలిచిన నరేందర్‍తో పాటు పార్టీ అధిష్టానం ఏనాడు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదన ప్రదీప్ రావులో ఉంది. వచ్చే ఎన్నికల్లో హైకమాండ్‍ అవకాశమిస్తే గులాబీ క్యాండిడేట్‍గా లేదంటే ఇంకో ప్రధాన పార్టీ అభ్యర్థిగా కారు దిగేందుకు రెడీగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గుడిమల్ల రవికుమార్‍ సైతం పార్టీలో అంటీముట్టనట్లు ఉన్నారు. సొంత పార్టీలోని ప్రభుత్వ చీఫ్‍ విప్‍ వినయ్​భాస్కర్‍పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత పార్టీ కోసం ఎంతో శ్రమించినా కనీస గుర్తింపు లేదని చెబుతున్నారు. ఏదో ఒక ప్రధాన పార్టీలో చేరేలా అడుగులు వేస్తున్నారు. వీరేగాక సిట్టింగ్‍ సీటు రాని క్రమంలో కారు దిగేందుకు.. మరో ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేలు ప్లాన్‍ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.