- మూడేండ్లలో రెండు సార్లే దిశ రివ్యూ మీటింగ్
- కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రివ్యూ చేసేందుకు ఇష్టపడని బీఆర్ఎస్ ఎంపీలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ) కమిటీ జాడ లేకుండా పోయింది. ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేయాల్సి ఉన్నప్పటికీ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ముందుకు రావడం లేదు. మూడేండ్లలో దిశ కమిటీ మీటింగ్ కేవలం రెండు సార్లు మాత్రమే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అమలుపై రివ్యూ చేస్తే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని బీఆర్ఎస్ ఎంపీలు రివ్యూ చేసేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదు.
మూడేండ్లలో రెండు సార్లే :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 20కి పైగా అభివృద్ధి పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి ఆఫీసర్లతో రివ్యూ చేసేందుకు దిశ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపీలతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు కో ఆప్షన్ మెంబర్లు దిశ కమిటీలో మెంబర్లుగా ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ చైర్మన్‌గా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. సోషల్ ఆడిట్లో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా రికవరీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. పోషక లోపంతో జిల్లాలో వేలాది మంది చిన్నారులు అవస్థలు పడ్తున్నారు. కొత్తగూడెం(భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లు తరుచూ రద్దు అవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యువతులతో పాటు గర్బిణులు, బాలింతలను రక్తహీనత వేధిస్తొంది. శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ స్కీం, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన స్కీంపై జిల్లా యువతకు పెద్దగా అవగాహన లేకుండా పోయింది.
నవంబర్ నుంచి ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలే..
కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే మొక్కలను పెంచారని వాటిని తొలగించాలని నవంబర్‌లో నిర్వహించిన దిశ మీటింగ్‌లో సభ్యులు డిస్కస్ చేశారు. ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కొత్తగూడెంలోని మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్‌లో శిశు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. వీటిపై చర్చిద్దామంటే దిశ మీటింగ్ పెట్టడం లేదని సభ్యులు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా కేంద్రం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించడం వల్ల పనులు స్పీడ్‌గా అవడంతో పాటు ఆఫీసర్లు బాధ్యతతో మరింత ఎక్కువగా పనిచేసే అవకాశం ఉందని పలువురు దిశ కమిటీ మెంబర్లు పేర్కొంటున్నారు. దిశ మీటింగ్‌తో కేంద్రం నుంచి ఇంకా ఏయే పనులకు ఫండ్స్ తెచ్చుకోవాలో కమిటీ మెంబర్లు ఎంపీల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంతటి ప్రాధాన్యత గల దిశ కమిటీ మీటింగ్‌ను నిర్వహించేందుకు ఎంపీలు ముందుకు రాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర పథకాలపై సమీక్ష లేక ఇబ్బందులు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, టెలికాం సేవలు, అగ్రికల్చర్, హార్టికల్చర్ విభాగాలపై చర్చించాల్సిన అవసరముంది. ఆహార భద్రతా పథకంలో భాగంగా అంత్యోదయ రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న రూ. వందల కోట్ల విలువైన పనులపై ఇప్పటి వరకు సమీక్షించలేదు. నేషనల్ హైవేలో భాగంగా జిల్లాలో నిర్మిస్తున్న రోడ్లు, బ్రిడ్జిల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అసంపూర్తి నిర్మాణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కేంద్ర నిధులతో చేపడ్తున్న స్కీంలపై సమీక్ష కానరావడం లేదు. డ్రింకింగ్ వాటర్, ఫారెస్ట్, ముద్ర లోన్స్లాంటి పలు స్కీమ్స్ పై సమీక్షించాల్సి ఉంది.