ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పోలింగ్ అధికారుల నియామకం, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 27న, కౌంటింగ్ జూన్ 5న ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 118 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 142 మంది పీవోలు, 142 మంది ఏపీవోలు, 284 మంది ఓపీవోలు అవసరం ఉన్నారని, ఆ దిశగా సిబ్బంది ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ విధులు నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బంది శిక్షణకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
ఏఆర్వో లతో సమావేశం..
ఏఆర్వో లతో సమావేశమై ఏర్పాట్ల గురించి కలెక్టర్ సమీక్షించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నందున ఏ దశలోనూ తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 83,879 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదుకాగా, ఇందులో 50,676 మంది పురుషులు, 33,199 మంది మహిళలు, నలుగురు గురు ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. రిజర్వ్ తో కలుపుకొని 129 బ్యాలెట్ బాక్సులు అవసరం ఉందని చెప్పారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 ఎంసీసీ, 24 ప్రత్యేక వీడియో బృందాల ఏర్పాటుచేసి
నిఘా పకడ్బందీగా చేపట్టాలన్నారు. సెక్టార్ అధికారుల నియామకం పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్నీ ఆర్డీవోలు, తాహసీల్దార్లు సందర్శించి ఏర్పాట్లు పరిశీలించాలన్నారు. 100 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉంటుందని, రిసెప్షన్ కేంద్రం నల్గొండలో ఉండనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ
జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, ఎల్డీఎం శ్రీనివాస రెడ్డి, ఎస్డీసీ రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, రాంబాబు, సత్యనారాయణ, ఎంవీఐ వెంకటరమణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ సతీశ్, ఎన్ఐసీ కోఆర్డినేటర్ రాం ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
‘యూనిఫామ్’ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి
ప్రభుత్వ పాఠశాలల, గురుకులాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు. తన ఛాంబర్ లో అధికారులతో విద్యార్థుల యూనిఫామ్ అందజేతపై సమీక్షించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో
చదివే విద్యార్థులందరికీ యూనిఫామ్ అందజేసేందుకు విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,48,837 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 1,15,980 మంది బాలురు, 1,32,857 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఇన్‌టైంలో యూనిఫామ్స్ అందేలా చూడాలన్నారు.
స్ట్రాంగ్ రూమ్ ల భద్రత కట్టుదిట్టం
ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ లను నిరంతరం పర్యవేక్షించాలని గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించి, స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు.