- బియ్యం రీసైక్లింగ్కుపాల్పడేవారిపై కఠిన చర్యలు
- ప్రజాపాలన నిర్వహణపై మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు రివ్యూ
కరీంనగర్, వెలుగు : పేదలకు ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ఇరిగేషన్, సివిల్‌సప్లయీస్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో ప్రజాపాలన నిర్వహణపై రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రజా పాలనకు శ్రీకారం చుట్టామన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జిల్లాలోని ప్రతి జీపీ, మున్సిపాలిటీలోని వార్డుల్లో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేయాలని, ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంతమంది రైస్ మిల్లర్లు, దళారులు రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం..
ఉమ్మడి జిల్లా పరిధిలోని మంథనిలోని చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్ లోని గౌరవెల్లి ప్రాజెక్టు వంటి నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, మేడిగడ్డతోపాటు అన్నారం బ్యారేజీ లను 29న పరిశీలిస్తామని తెలిపారు.
ప్రజాపాలనపై మంత్రుల దిశానిర్దేశం
అన్ని రకాల దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశం గురువారం నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన గ్రామ, వార్డు సభలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఇన్‌చార్జీగా నియామకమయ్యాక బుధవారం తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలతోపాటు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, చింతకుంట విజయరమణా రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాజన్నసిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా , కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లా పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అందరి ముఖాల్లో ఆనందమే ప్రభుత్వ ధ్యేయం..
పాలనలో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పుతో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామని, మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ జర్నీ సౌకర్యంతో ఇప్పటి వరకు 4 కోట్ల జీరో టికెట్స్ జారీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రజాపాలన జరిగే ప్రతి కేంద్రంలో నిరక్ష్యరాస్యుల కోసం వలంటీర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలకు సంబంధించి త్వరలోనే సిటిజన్ చార్టర్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశాం
కొత్త ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను తూచ తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. గ్రామసభల్లో ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై కూడా అప్లికేషన్లు ఇవ్వొచ్చని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్