- దోచుకున్న సైబర్ క్రిమినల్
- సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్ పరిధిలో మోసపోయిన బాధితుడు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అత్యాశకు పోయి రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ సైబర్ క్రిమినల్ బాధితుడి వాట్సాప్‌కు ఓ మెసేజ్ చేశాడు. అందులో ఫైవ్ స్టార్, త్రీ స్టార్, హోటల్స్, రెస్టారెంట్లకు రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామని, పార్ట్ టైంగా చేస్తూ సంపాదించవచ్చని నమ్మించాడు. దీంతో బాధితుడు ఓ హోటల్ పై రివ్యూ రాయగా సైబర్ క్రిమినల్ కొన్ని డబ్బులు పంపించాడు. తర్వాత యూట్యూబ్ లో ట్రేడింగ్ సబ్ స్ర్కైబ్ చేసి డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పాడు. దీంతో బాధితుడు మొదట రూ.1000 పంపగా, గంటలోపే రూ.1500 జమయ్యాయి. తర్వాత రూ.3వేలు పంపగా గంటలో రూ.4 వేలు వచ్చాయి. మళ్లీ రూ. లక్షకు లక్షా యాబై వేలు, రూ.2 లక్షలకు రూ.2 లక్షల రూ.80 వేలు ఇచ్చాడు. వేలకు వేలు వస్తుండడంతో ఆశపడిన బాధితుడు ఒకేసారి రూ.7 లక్షలు పంపాడు. అయితే, ట్రాన్సాక్షన్ కరెక్ట్ లేదని, మళ్లీ పంపాలని సైబర్ క్రిమినల్ కోరగా రూ. 6 లక్షల 30 వేలు పంపాడు.
డబ్బులు డబుల్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడంతో రూ.7 లక్షలు, రూ.2 లక్షల 50 వేలు ఇలా సుమారు రూ.22 లక్షలు పంపించాడు. డబ్బులను ఆర్టీజీఎస్ ద్వారా సైబర్ క్రిమినల్ చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే, డబ్బులు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తికి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. మోససోయానని గ్రహించి సైబర్ సెల్ నెంబర్1930కి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సీపీ.ఎన్.శ్వేత మాట్లాడుతూ లోన్ యాప్, లాటరీ, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పాన్‌కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో సైబర్ మోసాలు జరుగుతాయని, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.