17 మందికే టాప్​ ర్యాంక్.. నీట్​ యూజీ 2024 రీ రివైజ్డ్​ ఫలితాలు

17 మందికే టాప్​ ర్యాంక్.. నీట్​ యూజీ 2024 రీ రివైజ్డ్​ ఫలితాలు
  • ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్​లో రిజల్ట్స్​
  • సుప్రీంకోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఫలితాల సవరణ
  • గత ఫలితాలతో పోలిస్తే 75 శాతం తగ్గిన టాపర్లు
  • 13,16,268 నుంచి 13,15,853కు తగ్గిన 
  • అర్హత సాధించిన స్టూడెంట్ల సంఖ్య

న్యూఢిల్లీ : జాతీయస్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​(యూజీ) –2024 రీ రివైజ్డ్​ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్​ వ్యవహారంపై కొనసాగిన తీవ్ర వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా నేషనల్​ టెస్టింగ్​ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను విడుదల చేసింది. సవరించిన స్కోర్​కార్డ్స్​ను ఎన్టీఏ అధికారిక వెబ్​సైట్​లో పొందుపర్చింది. అంతకుముందు ఫైనల్​ రివైజ్డ్​ఆన్సర్​ కీని రిలీజ్​ చేసింది. ఎగ్జామ్​ అప్లికేషన్​ నంబర్, పుట్టిన తేదీ, అభ్యర్థి ఈ మెయిల్​ లేదా ఫోన్​ నంబర్​ను ఎంటర్​ చేసి రిజల్ట్స్​ను చెక్​ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మే 5న జరిగిన నీట్‌‌‌‌ పరీక్షకు  24,06,003 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 10,29,154 మంది పురుషులు, 13,76,831 మంది మహిళలు, 18 మంది థర్డ్ జెండర్స్​ఉన్నారు. 

తగ్గిన టాపర్ల సంఖ్య

ఈ ఏడాది జూన్​4న విడుదల చేసిన నీట్​ఫలితాల్లో 720 కి 720 మార్కులు సాధించి, మొత్తం 67 మంది టాప్​ ర్యాంకు సాధించారు. ఇందులో ఇన్విజిలేటర్ లోపాల కారణంగా పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి అదనపు మార్కులు ఇవ్వడం వల్ల ఆరుగురు విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. ఫిజిక్స్​లో ఓ ప్రశ్నకు ఎన్సీఈఆర్టీ 12 వ తరగతి పుస్తకం నుంచి  సమాధానమిచ్చినందుకు ఎన్టీఏ "గ్రేస్ మార్కులు" కలుపగా మరో 44 మంది టాప్​ర్యాంకు పొందారు. అయితే, ఢిల్లీ ఐఐటీ నిపుణల నివేదిక ప్రకారం.. ఫిజిక్స్​లోని ఆ ప్రశ్నకు నాలుగో ఆప్షన్​ పెట్టినోళ్లకు మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వాలని, మిగతా వారి మార్కులు ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

ఇందుకు అనుగుణంగా ఎన్టీఏ స్కోర్​కార్డులను సవరించింది. దీంతో రివైజ్డ్ రిజల్ట్స్ ప్రకారం.. 17 మంది అభ్యర్థులకే 1వ ర్యాంకు వచ్చింది. గత ఫలితాలతో పోలిస్తే 75 శాతం ఫస్ట్ ర్యాంకర్లు తగ్గిపోయారు. అలాగే,  అర్హత సాధించిన స్టూడెంట్ల సంఖ్య13,16,268 నుంచి 13,15,853 కు తగ్గింది. అంటే, రివైజ్డ్​ రిజల్ట్​ప్రకారం  415 మంది అర్హత కోల్పోయారు. రివైజ్డ్ ఫలితాల్లో 1వ ర్యాంకు సాధించిన 17 మందిలో నలుగురు రాజస్థాన్ అభ్యర్థులు, ముగ్గురు మహారాష్ట్ర అభ్యర్థులు, ఇద్దరు చొప్పున యూపీ, ఢిల్లీ అభ్యర్థులు ఉన్నారు. అలాగే, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్​, చండీగఢ్​, కేరళ, తమిళనాడునుంచి ఒక్కొక్కరు టాప్ 1 గా నిలిచారు. కాగా, త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్రాల వైద్యవిద్య డైరెక్టరేట్ల వెబ్‌‌‌‌సైట్లలో విడుదల అవుతాయని ఎన్‌‌‌‌టీఏ వెల్లడించింది.  

రిజల్ట్స్​ విడుదలలో గందరగోళం

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సవరించిన తుది ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసినట్టు గురువారం వార్తలు వెలువడ్డాయి. ఫిజిక్స్​విభాగంలో ఓ ప్రశ్నకు తప్పు సమాధానం గుర్తించిన విద్యార్థులకు కలిపిన గ్రేస్​మార్కులను తొలగించి, సవరించిన స్కోర్​కార్డ్స్​తో ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు రిజల్ట్స్​ను రిలీజ్​చేసినట్టు ఎన్టీఏ ప్రకటించింది. అధికారిక వెబ్​సైట్​లో రిజల్ట్స్​ ఉన్నాయంటూ లింక్ కూడా సర్క్యులేట్​ అయింది. అయితే, ఆ లింక్​ క్లిక్​ చేసిన స్టూడెంట్స్​కు నిరాశే ఎదురైంది. ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే సవరించిన రిజల్ట్స్​ పెడ్తామని కేంద్ర విద్యాశాఖ తరఫున పీఐబీ స్పష్టం చేసింది. సాయంత్రంలోపే ఫలితాలు వెబ్​సైట్​లో అప్​లోడ్​ అయ్యాయి.