
గోదావరిఖని, వెలుగు: విప్లవకారులు మాత్రమే నిజమైన దేశభక్తులని, ఇబ్బందులకు గురవుతున్నా అడవి బిడ్డలను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య లీడర్ విమలక్క తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ కగార్, దండకారణ్యంలో నక్సలైట్ల ఏరివేత పేరుతో అకారణంగా ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బహుళజాతి కంపెనీలకు ఖనిజ సంపదను కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఆదివాసీ బిడ్డలు లేకుంటే అడవి ఏమాత్రం మిగిలేది కాదని, అలాంటి అడవి బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్నివర్గాల ప్రజలు అండగా నిలబడాలని ఆమె కోరారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణతో ప్రజలు, కార్మికులు అతలాకుతలం అవుతున్నారని, సింగరేణి సంస్థను కాపాడుకోవాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడకుండా కార్మికోద్యమాలను పక్కదారి పట్టిస్తున్నాయని, చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న గోదావరిఖనిలో అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్టీయూ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ మాతంగి రాయమల్లు, పోచమల్లు, సదానందం, రత్నకుమార్ పాల్గొన్నారు.