కొత్త విద్యా విధానంతో విప్లవాత్మక  మార్పులు

మన దేశంలో దశాబ్దాల కాలంగా అమలవుతూ వచ్చిన విద్యావిధానం బాధ్యతగల పౌరుల్ని, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడంలో విఫలమైంది. ఈ పరిస్థితుల్ని తిరగరాస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 34 ఏండ్ల క్రితం నాటి ‘జాతీయ విద్యా విధానం 1986’ స్థానంలో ‘న్యూ నేషనల్​ ఎడ్యుకేషన్​పాలసీ(ఎన్ఈపీ) 2020’ ని తీసుకొచ్చింది. కొత్త విధానం పాఠశాల, ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున సంస్కరణలకు బాటలు వేయనుంది. అందరికీ సమాన విద్యా అవకాశాలు, అందుబాటులో విద్య, త్రిభాషా సూత్రం అమలు, మాతృభాషలో సాంకేతిక విద్యాబోధన లాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.  

జాతీయ నూతన విద్యా విధానం నవ భారత నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించనుంది. వనరులు పెంపొందించడంలో, ప్రపంచంలో ఇండియా ప్రతిష్ట పెంచడంలో భారీ మార్పులు తీసుకురానుంది. 2030కి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా  ప్రతి స్టూడెంట్​లో ప్రత్యేక సామర్థ్యాలను వెలికితీయడం ద్వారా భారతదేశం ఒక శక్తిమంతమైన జ్ఞాన సమాజంగా, ప్రపంచ విజ్ఞాన మహాశక్తిగా మార్చాలనేదే  కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఉపాధ్యాయులు, రాష్ట్రాలు, స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి సూచనలు తీసుకొని లక్షల మంది పౌరులతో టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త విద్యా విధానం దశల వారీగా అమలు కానుంది. కొత్త విద్యా విధానం తీసుకొచ్చిన మార్పుల్లో మొట్టమొదటిది పూర్వ ప్రాథమిక విద్య. ఇప్పటి వరకు సాగిన10+2 విద్య స్థానంలో ‘ఎన్​ఈపీ 2020’ కొత్తగా 5+3+3+4  విధానం తీసుకువచ్చింది. 3 నుంచి 8, 8 నుంచి -11, 11-నుంచి 14, 14- నుంచి18 సంవత్సరాల స్టూడెంట్స్​కొత్త విద్యా విధానం పరిధిలోకి వస్తారు. అంతర్జాతీయంగా దీన్ని కీలకమైన, పిల్లల మానసిక వికాసానికి సరైన దశ అని గుర్తించారు. 
మాతృ భాషలో చదువుకొనే అవకాశం
నూతన విధానంలో మూడు సంవత్సరాలు అంగన్ వాడీ లేదా ప్రీ స్కూల్ తో మొత్తం12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుంది. ఉన్నతమైన ఆలోచన స్థాయిని పెంచేందుకు, కీలకమైన అంశాలను నేర్చుకునేందుకు కొత్త విధానంలో పాఠ్యాంశాలను తగ్గించారు. ప్రయోగాత్మక అభ్యాసానికి వీలు కల్పించి, సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఆర్ట్స్, సైన్సు మధ్య కఠిన విభజన ఏదీ ఉండదు. ప్రతీ హయ్యర్ ​స్కూల్ ​స్టూడెంట్​6వ తరగతి నుంచే ఇంటర్న్ షిప్ తో పాటుగా ప్రొఫెషనల్​ఎడ్యుకేషన్ నేర్చుకుంటాడు. స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా కనీసం 5వ తరగతి వరకు ఉంచాలని, 8వ తరగతి ఆ పై వరకు దీన్ని కొనసాగించవచ్చని కొత్త విద్యా విధానం చెబుతోంది. సంస్కృతంతోపాటు భారతదేశంలోని ఇతర ప్రాచీన భాషలు, సాహిత్యం కూడా విద్యార్థులు ఆప్షనల్​సబ్జెక్టుగా ఎంచుకునే వీలు కల్పించింది. 6- నుంచి 8 తరగతుల మధ్య ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం కింద సెకండరీ స్థాయిలో పలు విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ఒకే సబ్జెక్టు, ఒకే కోర్సుకు కట్టుబడి ఉండాలనే నిర్బంధం నుంచి కొత్త విధానం స్టూడెంట్స్ కు విముక్తి కల్పించింది. ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అందించాలన్న నిర్ణయం మన దేశీయ భాషలకు కొత్త ఊపిరిపోస్తూ భావితరాలకు మాతృభాషలోని మాధుర్యాన్ని అందించనుంది. కొత్త విద్యావిధానంలో భాగంగా మారుతున్న కాలం, పరిస్థితులను బట్టి స్టూడెంట్స్​కు ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​లో శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు చూపునకు అద్దం పడుతోంది. వినికిడి లోపం గల విద్యార్థుల కోసం దేశ, రాష్ట్రస్థాయి పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేసింది. స్టూడెంట్​పుట్టుక లేదా నేపథ్యం వల్ల  విద్య నేర్చుకోవడానికి, ఇతర రంగాల్లో రాణించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం కోల్పోరాదన్నది ఎన్ఈపీ-–2020 లక్ష్యం. 
నిష్ట 2.0తో టీచర్లకు శిక్షణ
విద్యార్థి జీవితంలో టీచర్లు కీలకమైన పాత్ర పోషిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నిష్ట 2.0 కూడా విద్యావ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని టీచర్లు ఆధునిక అవసరాలకు తగినట్లుగా శిక్షణ పొందుతారు.  ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనివర్సిటీ(ఎంఈఆర్​యూ)లను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ను ఉన్నతస్థాయి సంస్థగా మారుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ) మాత్రమే ఉంటుంది. వైద్య విద్య, న్యాయ విద్యలను మాత్రం దీని నుంచి మినహాయించారు.  నూతన విద్యా విధానంలో భాగంగా నేషనల్​ స్కాలర్​షిప్​ పోర్టల్​ను మరింత విస్తరించి ప్రతిభ గల స్టూడెంట్స్​ను మరింత ప్రోత్సహించనున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. న్యూ ఎడ్యుకేషన్​ పాలసీ పకడ్బందీగా అమలైతే విద్య కోసం ఇతర దేశాల నుంచి స్టూడెంట్స్​ఇండియాకు రావడం చూస్తాం.  దేశంలోని 150కి పైగా యూనివర్సిటీల్లో ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏర్పాటు కావడం విశేషం. ఏడాది కాలంలో 1200కు పైగా ఉన్నత విద్యా సంస్థల్లో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి వందల కొద్దీ కొత్త కోర్సులు ప్రారంభమయ్యాయి. 
ఎన్​రోల్​మెంట్​ పెరుగుతది
గాంధీజీ దార్శనిక ఆలోచనను నెరవేర్చడానికి నూతన విద్యావిధానంలో స్థానిక భాష కూడా ఉన్నత విద్యలో బోధనా మాధ్యమంగా చేర్చారు. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీలు  హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా అనే 5 భారతీయ భాషల్లో బోధన కొనసాగిస్తాయి. ఇంజనీరింగ్ కోర్సును 11 భారతీయ భాషల్లోకి అనువదించడానికి  సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు. పేదలు, మధ్యతరగతి విద్యార్థులు, దళిత,వెనుకబడిన, గిరిజనులకు దీనివల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. మాతృభాషలో విద్యనార్జించడం పేద పిల్లల విశ్వాసాన్ని పెంచుతుంది. ఉన్నత విద్యలో దేశంలో స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్- గ్రాస్ ఎన్​రోల్​మెంట్​రేషియో)ని 26.3 శాతం నుంచి 2035 నాటికి 50 శాతానికి పెంచాలనేదే జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యం. ప్రసుత్తం ఉన్న విద్యా సంస్థలకు కొత్తగా 3.5 కోట్ల సీట్లు అందుబాటులోకి తేనుంది. 2030 నాటికి పాఠశాల విద్యలో 100 శాతం జీఈఆర్ తో ప్రీ-స్కూల్ నుంచి సెకండరీ స్థాయి వరకు విద్యను సార్వజనీనం చేయడం ఎన్ఈపీ 2020 ఉద్దేశం. బడి బయట ఉన్న సుమారు 2 కోట్ల మంది స్టూడెంట్స్​కొత్త విద్యా విధానం ద్వారా తిరిగి బడుల్లో చేరే ఆస్కారం ఉంది. 
ఓబీసీలకు రిజర్వేషన్
నూతన విద్యా వ్యవస్థలో అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గానికి కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఎంబీబీఎస్, ఎండీ, డిప్లమా, బీడీఎస్, ఎండీఎస్ కోర్సులు చదివే 5,500 మంది విద్యార్థులకు కొత్తగా ఈ రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం కలగనుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం ఓబీసీలకు 4000, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు1500 సీట్లు దక్కనున్నాయి. తెలంగాణలో కూడా అనేకమంది ఓబీసీ విద్యార్థులకు దీని ద్వారా న్యాయం జరుగుతుంది. 2021–-22 అకడమిక్​ఇయర్​నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని పేర్కొనడం సంతోషకరం. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని ముఖ్యంగా తెలంగాణలోని వేలాది మంది ఓబీసీ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అత్యున్నత వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. దళిత, గిరిజన, బలహీనవర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జాతీయ స్థాయిలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని అమలు చేయకపోవడం బాధాకరం. చదువు ఉద్యోగం కోసం కాదు, చదువును మించిన సంపద లేదు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడే నవీన భారత నిర్మాణం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం భావి భారత పౌరులను సమర్థంగా తీర్చిదిద్దుతుంది.

                                                                                                                             - డా.కె. లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు