అంతరిక్షం అత్యంత అద్భుత రహస్యాల పుట్ట. దాని రహస్యాలను ఆవిష్కరిస్తూ మానవాళి సర్వతోముఖాభివృద్ధికి, భవిష్యత్ తరాల ప్రగతికి అంతరిక్ష వైజ్ఞానిక సాంకేతిక శాస్త్రాలను అన్వేషించడం జరగాలని ఐక్యరాజ్య సమితి నమ్ముతోంది. ఇదే క్రమంలో 12 ఏప్రిల్1961 రోజున సోవియట్ యూనియన్‌కు చెందిన వ్యోమగామి ‘యూరీ గగారిన్’ తొలిసారి మానవ అంతరిక్ష విమానం ‘వోస్టాక్-1’ ద్వారా భూగ్రహం చుట్టూ108 నిమిషాలు ప్రయాణం చేసిన రోజుకు గుర్తుగా ఏటా ఏప్రిల్12న ‘అంతర్జాతీయ మానవ అంతరిక్ష నౌకాయాన దినం(ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యుమన్ స్పేస్ ఫ్లైట్)’ పాటిస్తున్నారు. 12 ఏప్రిల్1981 రోజున కూడా తొలి స్పేస్ ఫ్లైట్ ‘ఎస్‌టీఎస్-1‘ను కొలంబియా నుంచి ప్రయోగించారు. ఈ అంతరిక్ష మానవ ప్రయాణంతో మానవాళి సర్వతోముఖాభివృద్ధిలో అంతరిక్ష రహస్యాల గుట్టు విప్పేందుకు, జీవనశైలి సమూల మార్పులకు మార్గం సుగమం అయింది. 16 జూన్ 1963న జరిగిన మానవ అంతరిక్ష నౌకాయానంలో తొలి మహిళ ‘వాలెంటీనా తెరిస్కోవా’ పాల్గొని రికార్డు నెలకొల్పారు. 20 జులై 1969 రోజున అంతరిక్ష విమానయానం చేసిన ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్’ చంద్రుడిపై తొలి అడుగులు వేసిన వ్యోమగామిగా అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. 17 జులై 1975న అమెరికా -రష్యా సంయుక్తంగా ‘అపోలో -సోయుజ్’ మానవ సహిత అంతరిక్ష విమానం ప్రయోగించింది. 1961 నుంచి నేటి వరకు యూఎస్, రష్యా, చైనా దేశాలు13 ప్రాజెక్టుల ద్వారా మానవ సహిత వైమానిక నౌకల్ని అంతరిక్ష శోధనలకు ప్రయోగించింది. నేటి వరకు 565 వ్యోమగాములు భూకక్ష్యకు చేరడం, 24 మంది భూకక్ష్య దాటి పోవడం, 12 మంది చంద్రమండలం మీద కాలు మోపారు. అంతరిక్షాన్ని, గ్రహ ఉపరితలాలను మానవ శాంతియుత జీవనానికి వినియోగించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయాలనే పిలుపుతో 11 ఏప్రిల్ 2011న యూఎన్వో తీసుకున్న తీర్మానం ప్రకారం 12 ఏప్రిల్ 2012 నుంచి ఏటా ‘అంతర్జాతీయ మానవ అంతరిక్ష నౌకాయాన దినం’ నిర్వహిస్తున్నారు.
పరిశోధనా ఫలాలు..
అంతరిక్ష పరిశోధనల ఫలితంగా నేటి డిజిటల్ యుగపు మానవుడి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. భూగ్రహ హరిత సంపదను అంచనా వేయడానికి, కమ్యూనికేషన్ రంగంలో కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగం, వాతావరణ సూచనలను అందించే ఉపగ్రహాల ప్రయోగం, అంతరిక్ష స్టేషన్ల ఏర్పాటు, టెలిస్కోపిక్ శోధనలు, మెటీరియల్ సైన్స్, ఎర్త్ సైన్స్, బయోమెడికల్ సైన్స్, భౌతికశాస్త్రం, ఇతర గ్రహ/ఉపగ్రహాలను చేరడం/అన్వేషించడం, శాటిలైట్ టెక్నాలజీ విస్తరణ, సాంస్కృతిక ప్రగతి, అంతరిక్ష అద్భుత రహస్యాల శోధన లాంటి అంశాల్లో మానవాభివృద్ధికి అంతరిక్షాన్ని ఓ అద్భుత యానకంగా వాడుకోవడం కొనసాగుతున్నది. అంతరిక్ష పరిశోధనల్లో మానవ అంతరిక్ష విమానయానం ప్రధాన భూమిక నిర్వహిస్తున్న శుభవేళ అంతరిక్ష శాస్త్రసాంకేతిక రంగం ఆధునిక మానవాళికి వరంగా మారుతూ, అద్వితీయ సేవలను అందిస్తున్నది. ఇలాంటి అంతరిక్ష శోధనలు మానవాళి సుఖజీవనానికి నూతన దారులు వేయాలని ఆశిద్దాం.
–డా. బి. మధుసూదన్ రెడ్డి సోషల్ ఎనలిస్ట్