- దళాలకు ఆటాపాటలు నేర్పించిన గద్దర్
1972లో జననాట్య మండలి ఏర్పాటు - ఊరూరా తిరిగి ప్రజలను ఉద్యమం వైపు నడిపించిన ప్రజాగాయకుడు
నిర్మల్, వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్.. విప్లవోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 1972లో గద్దర్ ఆధ్వర్యంలో ఆనాటి పీపుల్స్ వార్ ( ప్రస్తుతం మావోయిస్టు పార్టీ)కు అనుబంధంగా జననాట్య మండలి ఏర్పాటైంది. గద్దర్ దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ.. ఆదిలాబాద్ అడవుల్లో దళాలకు విప్లవ శిక్షణనిచ్చారు. ఆటాపాటలు నేర్పించారు. అలాగే జననాట్య మండలి బృందాలు అప్పట్లో గ్రామాల్లో పర్యటిస్తూ తమ ఆటాపాటలతో వందలాది మందిని ఉద్యమం వైపు ఆకర్షితులను చేశాయి. జననాట్య మండలి పేరుతో గద్దర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.
గోండు భాషలో ‘తాక్ తాక్ మున్నే తాక్.. కోయ దాదా.. రాగల్ జెండా కేయం తారే..’ అనే పాటను పాడి వేలాది మంది ఆదివాసీలను ఆకట్టుకున్నారు. 1987లో అజ్ఞాతంలోకి వెళ్లిన గద్దర్ రెండు న్నరేండ్లు దండకారణ్యంలోనే ఉన్నారు. అడవుల్లో వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. అప్పట్లో పీపుల్స్ వార్ తెలంగాణ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలపడంతో గద్దర్ కూడా ‘సామాజిక తెలంగాణ’ పేరుతో ఆటాపాటలతో ఉద్యమ బాట పట్టారు. వేలాది ప్రదర్శనలు ఇచ్చి, ప్రజలను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించారు.
ఆదిలాబాద్ తో విడదీయలేని బంధం..
ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు గద్దర్ ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేవారు. ప్రభుత్వ నిర్బంధం మొదలైనంక వచ్చిన ప్రతిసారీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2007లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక వెయ్యి ఉరులమర్రి వద్ద నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని విమలక్కతో కలిసి గద్దర్ ఆవిష్కరించారు.
1985 కన్నా ముందు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో జరిగే వార్షికోత్సవ వేడుకల్లో గద్దర్ పాల్గొనేవారు. అప్పట్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్.. విద్యార్థి సంఘాలకు ప్రాతినిధ్యం వహించేది.