- సోడియం అయాన్, మెగ్నీషియం కాథోడ్
- బ్యాటరీల కోసం ముమ్మర ప్రయోగాలు
- తగ్గనున్న ఉత్పత్తి ఖర్చులు
- ప్రస్తుతం ఈవీ బ్యాటరీల్లో ఖరీదైన లిథియం వాడకం
- మన దేశంలో పరిమితంగా లభిస్తున్న లిథియం
- దాని ప్లేస్‌లో తక్కువ ఖర్చుతో సోడియం వాడే ప్రయత్నాలు
- సోడియం బ్యాటరీలతో సేఫ్టీ, స్టోరేజీ ఎక్కువే
- పావుగంటలో ఫుల్ చార్జింగ్ అయ్యే సిస్టమూ రెడీ
- యూనివర్సల్ ర్యాపిడ్ చార్జింగ్ సిస్టమ్‌ను తెచ్చిన క్లీన్ ఎలక్ట్రిక్ సంస్థ
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. బైకుల నుంచి బస్సుల వరకు ఈవీలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. కాలుష్యం లేకపోవడం, పెట్రోల్/డీజిల్ ఖర్చులు లేకపోవడం వంటి కారణాలతో జనం వీటికే మొగ్గుచూపుతున్నారు. ఈవీలనే ప్రభుత్వాలు కూడా రవాణా వ్యవస్థలో భాగం చేస్తున్నాయి. కానీ, డిమాండ్ పెరుగుతున్నా.. ఆయా బండ్ల ధరలు మాత్రం భారీగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అత్యంత ముఖ్యమైన బ్యాటరీల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
ఈవీలను ప్రజలకు అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చేలా ముమ్మర ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది బ్యాటరీ. ప్రస్తుతం అన్ని ఈవీల కోసం, సోలార్/విండ్ పవర్ వంటి పునరుత్పాదక విద్యుత్ స్టోరేజీల కోసం లిథియం అయాన్ బ్యాటరీలనే వాడుతున్నారు. లిథియం పరిమితంగా లభిస్తుండడంతో దాని డిమాండ్ పెరిగి బ్యాటరీ ధర కూడా ఎక్కువగా ఉంటున్నది.
దీంతో ప్రత్యామ్నాయంగా సోడియం అయాన్ బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చేందుకు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీల్లోనే కాథోడ్ మెటీరియల్ రీప్లేస్మెంట్పైనా సైంటిస్టులు దృష్టి పెట్టారు. ఆ రెండు రకాల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఈవీల అగ్గువ ధరకే లభించే అవకాశాలుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోడియం అయాన్ బ్యాటరీ ఖర్చు తక్కువ
లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సోడియం అయాన్ బ్యాటరీలు చాలా తక్కువ ధరకే వస్తాయి. కారణం.. లిథియంతో పోలిస్తే సోడియం విరివిగా లభించడమే. అంతేకాదు, సేఫ్టీ విషయంలోనూ సోడియం అయాన్ బ్యాటరీలే మేలని పరిశోధకులు అంటున్నారు. మూలకం వెలికితీతలో ఇటు పర్యావరణానికీ హాని జరగదంటున్నారు. మామూలుగా అయితే.. లిథియం అయాన్ బ్యాటరీల్లో కరెంట్ పాస్ అవ్వడానికి (ఎలక్ట్రిక్ కండక్టివిటీ) కోబాల్ట్ అనే మూలకంతో కాథోడ్ను పెడతారు. కాపర్ వైరింగ్ చేస్తారు. ప్రస్తుతం కోబాల్ట్ కొన్ని దేశాల్లోనే లభ్యమవుతున్నది.
మన దేశంలో దొరకడం లేదు. దాన్ని వెలికితీయడమూ శ్రమతో కూడుకున్న పని. పైగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదన్న ఆందోళనలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాని అవసరం లేకుండా భూమ్మీద ఎక్కువగా లభించే అల్యూమినియంతోనే ఎలక్ట్రిక్ కండక్టివిటీ జరిగే సోడియం అయాన్ బ్యాటరీలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
సేఫ్టీ ఎక్కువ..
లిథియం బ్యాటరీల్లో ఎలక్ట్రిక్ కండక్టివిటీలో రెసిస్టెన్స్ ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. దాని వల్ల ఎలక్ట్రాన్స్ ఓ క్రమపద్ధతిలో పాస్ కావని, ఫలితంగా ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ జరిగి వాటితో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. సోడియం అయాన్ బ్యాటరీలతో ఇలాంటి ప్రమాదాలేవీ ఉండవని చెప్తున్నారు. సోడియం అయాన్ల ఎలక్ట్రిక్ కండక్టివిటీ స్థిరంగా ఉంటుందని, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భంలోనూ స్థిరంగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.
వీటి తయారీ కూడా పర్యావరణహితంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మామూలుగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కెమికల్స్‌ను వాడుతుంటారు. దీనికి అత్యంత డ్రై కండిషన్ ఉన్న రూమ్స్ అవసరం. కానీ, సోడియం అయాన్ బ్యాటరీల విషయంలో వాటర్ రెసిస్టెంట్ క్యాథోడ్లను వాడడం వల్ల హానికారక రసాయనాల అవసరం ఉండదు. బ్యాటరీలు తయారు చేసేటప్పుడు విషవాయువులు కూడా విడుదల కావని సైంటిస్టులు చెప్తున్నారు.
సరఫరా నష్టాలు లేకుండా..!
ప్రస్తుతం మన దేశంతోపాటు వివిధ దేశాలు సోలార్/విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్‌పైనా పనిచేస్తున్నాయి. అలా ఉత్పత్తి చేసిన కరెంట్‌ను కొన్ని చోట్ల డైరెక్ట్‌గా గ్రిడ్‌కు కనెక్ట్ చేసి సరఫరా చేస్తున్నారు. అమెరికా వంటి దేశాలు ఈ పవర్‌ను బ్యాటరీల్లో స్టోర్ చేసుకొని వాడుకుంటున్నారు. ఇక్కడ కూడా లిథియం అయాన్ బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే.. వీటికి తక్కువ ఖర్చుతో కూడిన సోడియం అయాన్ బ్యాటరీలను వాడుకునేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.
సోడియం అయాన్ బ్యాటరీ వల్ల మారుమూల గ్రామాలకు కూడా ఎలాంటి పవర్ ఔటేజ్ లేకుండా.. సరఫరా నష్టాలూ లేకుండా కరెంట్ సరఫరా చేయొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. చాలా మంది ఇండ్లలో కరెంట్‌తో చార్జింగ్ చేసుకునే లేదా సోలార్ ఇన్వర్టర్లనూ వాడుతున్నారు. వాటిలోనూ ఈ సోడియం అయాన్ బ్యాటరీలు మెరుగ్గా పనిచేస్తాయంటున్నారు. ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లలో వాడే బ్యాటరీలకూ ఇవి రీప్లేస్మెంట్లుగా ఉంటాయని పేర్కొంటున్నారు.
కోబాల్ట్ అవసరం లేని మరో బ్యాటరీ..
బ్యాటరీల ఖర్చును తగ్గించే మరో రకం బ్యాటరీకి రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ సైంటిస్టులు రూపకల్పన చేశారు. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఎలక్ట్రిక్ కండక్టివిటీకి వాడే కోబాల్ట్ కాథోడ్ను మరో మూలకంతో రీప్లేస్ చేశారు. ఎక్కువగా లభించే మెగ్నీషియం మూలకంతో కోబాల్ట్ కాథోడ్ స్థానాన్ని రీప్లేస్ చేశారు. కోబాల్ట్‌తో పోలిస్తే లిథియం అయాన్ మూవ్‌మెంట్‌ను ఈ మెగ్నీషియం కాథోడ్ మరింత మెరుగుపరిచిందని గుర్తించారు.
అంతేగాకుండా బ్యాటరీ పనితీరు మెరుగపడిందని, అధిక సామర్థ్యం వచ్చి స్థిరత్వమూ పెరిగిందని, ఎక్కువ కాలంపాటు పవర్ స్టోరేజీ ఉంటుందని ఎన్ఐటీ రీసెర్చర్లు తేల్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ చేపట్టిన నానోమిషన్ ప్రోగ్రామ్ కింద ఈ రీసెర్చ్‌కు నిధులను సమకూర్చారు. దీనికి పేటెంట్ కూడా లభించింది.
పావుగంటలో ఫుల్ చార్జింగ్ అయ్యేలా..!
ఈవీల్లో బ్యాటరీల వాడకమే కాదు.. వాటిలో చార్జింగ్ అయిపోతే త్వరగా ఫుల్ చేయడమూ ఇప్పుడు పెద్ద సవాలే. ఒకసారి బ్యాటరీని ఫుల్ చేయాలంటే కనీసం గంట నుంచి 4 గంటల వరకూ పడుతున్నది. తక్కువ సమయంలో ఈవీ బ్యాటరీలు ఫుల్ అయిపోయేలా క్లీన్ ఎలక్ట్రిక్ అనే సంస్థ పరిష్కారం చూపించింది. బ్యాటరీలను పావు గంటలో ఫుల్ చార్జింగ్ చేసే సరికొత్త యూనివర్సల్ ర్యాపిడ్ చార్జింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 80 నుంచి 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెప్తున్నది.
అంతేకాదు.. ఓఈఎం బౌన్స్, ఒమెగా సెయికీ మొబిలిటీ సంస్థలతో ఒప్పందమూ చేసుకుంది. బౌన్స్ సంస్థ తన ఎలక్ట్రిక్ బైకుల్లో ఈ టెక్నాలజీని వాడనుంది. ఆ బైకులతో 80 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. ఇక ఒమెగా సెయికీ మొబిలిటీ సంస్థ తన ఎలక్ట్రిక్ ఆటోల్లో టెక్నాలజీని ప్రవేశపెడుతున్నది. తద్వారా 125 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వాలని భావిస్తున్నది. ఈ ఏడాది మార్చి నుంచే భారీ స్థాయిలో ఈ టెక్నాలజీతో కూడిన బ్యాటరీలను క్లీన్ ఎలక్ట్రిక్ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా ఉండేలా టైమ్‌నూ సేవ్ చేసి.. ఆయా చార్జింగ్ స్టేషన్ల ఓనర్లకూ రెవెన్యూ జనరేషన్నూ పెంచేందుకు వీలుంటుందని సంస్థ చెప్తున్నది.