- పోలీస్ శాఖలో ఎవిడెన్స్‌ల భద్రత కోసం కొత్త టెక్నాలజీ
- ప్రతి పోలీస్ స్టేషన్ కు కొత్తగా రెండు మొబైల్ ఫోన్లు
- కోర్టుల్లో పోలీసులకు తప్పనున్న తిప్పలు
నిర్మల్, వెలుగు: సాక్షాలు, రికార్డులను భద్రపరిచే సాంకేతిక నైపుణ్యం సరైన రీతిలో లేక పోలీసు శాఖ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. నేర పరిశోధన కోసం చేస్తున్న పోలీసుల శ్రమ వృథా అవుతోంది. కష్టపడి కేసులను ఛేదించి నిందితులను జైలుకు పంపుతున్నప్పటికీ కేసుల చివరి దశలో సాక్ష్యాలు అందుబాటులో లేకపోతుండడం పోలీసులను చిక్కుల్లో పెడుతోంది. కొన్ని తీర్పుల విషయంలో పోలీసు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగించుకొని ఇక కేసులకు సంబంధించిన సాక్ష్యాలను చిరకాలం భద్రపరుచుకునేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ‘ఈ సాక్ష్య’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో సాక్షాలను భద్రపరచడం పోలీసు శాఖకు సులభతరం కానుంది.
సాక్షాల భద్రత సులభతంసుదీర్ఘకాలం పాటు సాక్ష్యాలను భద్రపరిచే సౌకర్యం లేని కారణంగా పోలీస్ శాఖ ప్రతికూలత ఎదుర్కొంటోంది. మొన్నటివరకు కేవలం ఫొటోలు, రికార్డులు, వీడియోలు సాక్ష్యాలకు ఆధారంగా ఉండేవి. ఆ తర్వాత కంప్యూటర్లలో ప్రత్యేక ఫోల్డర్లలో సాక్ష్యాలను భద్రపరిచే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
Also Read :- 40 వేల కోట్లు ఇవ్వండి .. కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి
అయితే వైరస్‌తో పాటు పలు సాంకేతిక కారణాలతో ఇవి కూడా డిలీట్ అవుతుండడం పోలీస్ శాఖకు సమస్యగా మారింది. దీంతో ఆ శాఖ సాంకేతిక నిపుణులు ఈ సాక్ష్య యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను కొద్ది రోజుల క్రితం ప్రయోగాత్మకంగా వినియోగించి సక్సెస్ అయ్యారు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అధికారికంగా ఉపయోగించి సాక్ష్యాలను భద్రపర్చనున్నారు.
ఫొటోలు, వీడియోలు, రికార్డులు
నేరాలకు సంబంధించిన సాక్ష్యాలను జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ప్రత్యేకంగా రెండు మొబైల్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఫోన్లలో సాక్ష్య యాప్‌ను ఇన్స్టాల్ చేసి ఇకనుంచి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలకు సంబంధించిన ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని రికార్డ్ చేయనున్నారు. ఈ రికార్డులను కూడా యాప్‌లో భద్రపరచనున్నారు.
యాప్‌లో భద్రపరచబడిన సాక్ష్యాధారాలను కోర్టుల్లో ప్రవేశపెట్టి నేరస్తులకు తొందరగా శిక్ష పడేలా చూడవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు మొబైల్ ఫోన్లను ఈ సాక్ష్య్ యాప్ కోసం అందించారు. ఇకనుంచి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగే నేరాలకు సంబంధించిన రికార్డులు, సాక్ష్యాలను ఈ యాఫ్‌లో భద్రపరచాలని సూచించారు.