నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సంపేట టికెట్‌ను కాంగ్రెస్ ఇప్పటికే దొంతి మాధవరెడ్డికి కేటాయించింది. రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి1994, 1999, 2009లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో వరంగల్ పశ్చిమ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి దాస్యం వినయ్‌భాస్కర్ చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా బీజేపీతో అంటీమూట్టనట్టుగా ఉంటున్నారు. 2023 అక్టోబర్ 15న రేవంత్ రెడ్డి, మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
రేవూరి ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ పరకాల నుంచి టికెట్ ఇస్తే అక్కడినుంచి టికెట్ ఆశిస్తున్న కొండా సురేఖ, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.