రేవంత్‌పై కక్ష సాధిస్తున్నరు
రాష్ట్ర సర్కార్ బెయిల్ రాకుండా చేస్తున్నది
లోక్‌సభలో కాంగ్రెస్ ఫైర్
కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకోవాలని వినతి
అరెస్టు అంశంపై సభలో నోటీసుల
చర్చకు అవకాశం ఇచ్చిన స్పీకర్
న్యూఢిల్లీ, వెలుగు: మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అంశం పార్లమెంట్‌ను తాకింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై కక్షసాధిస్తున్నదని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని, బెయిల్ కూడా రాకుండా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. వెంటనే కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. రేవంత్ అరెస్టు అంశంపై గురువారం లోక్ సభలో తమిళనాడు ఎంపీలు మణికమ్ ఠాగూర్, సుబ్బరామన్ తిరునవుక్కరసర్, పంజాబ్ ఎంపీ జబ్బీర్సింగ్ గిల్ నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ వాయిదా తీర్మానం అందజేశారు. క్వశన్ అవర్ ముగిసిన అనంతరం మణికమ్ నోటీస్‌పై స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా స్వల్ప చర్చకు అవకాశం ఇచ్చారు.
అది ప్రతీకార చర్యే: మణికమ్
ఎంపీ రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాగూర్ మండిపడ్డారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ( కేటీఆర్) 28 ఎకరాల్లో ఫాంహౌస్‌ను అక్రమంగా నిర్మించారని, దీన్ని బయటికి తెచ్చినందుకు రాజకీయ ప్రతీకారంగా తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టిందని లోక్‌సభలో ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి కలుగజేసుకొని, వాస్తవాలను సభకు తెలియజేయాలని ఆయన కోరారు. మణికమ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీలు తప్పుబట్టారు. కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాగూర్ సభను పూర్తిగా పక్కదారి పట్టించారని టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. రేవంత్ చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే ఆయనను అరెస్ట్ చేసినట్లు లోక్‌సభకు తెలిపారు.
స్పీకర్‌కు ఎంపీ జ్యోతిమణి లేఖ
రేవంత్‌రెడ్డి అరెస్టుపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ మరో ఎంపీ జ్యోతిమణి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫాంహౌస్ విషయాన్ని బహిర్గతం చేసిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు బెయిల్ రాకుండా చేస్తోంది. రేవంత్‌రెడ్డిది కేవలం రాజకీయ అరెస్టు. ఈ విషయంలో కలుగజేసుకోండి. ఆయన లోక్‌సభకు హాజరయ్యేలా చూడండి’ అని లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు.
For More News..