సోనియమ్మ పార్లమెంటు తలుపు మూసే తెలంగాణ ఇచ్చింది

వరంగల్‍, హన్మకొండ, వెలుగు: ‘‘సోనియాగాంధీ పార్లమెంట్‍ తలుపులు మూసి, లైవ్‍ కట్‍ చేసి తెలంగాణ ఇచ్చిందని ప్రధాని మోడీ పార్లమెంట్‍లో చెప్పారు. అవును అది నిజమే. ప్రపంచం ఏకమైనా.. పెప్పర్‍ స్ప్రేలు కొట్టినా నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకుంటే.. రాబోయే 100 సంవత్సరాలైనా మన కల నెరవేరకబోతుండే.. మన రాష్ట్రం రాకపోతుండే’’ అని పీసీసీ చీఫ్​రేవంత్‍రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్​లో జరిగిన రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు. సోనియమ్మ నాలుగు కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలొచ్చినా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఆంధ్రాలో కాంగ్రెస్‍ పార్టీ చచ్చిపోయినా.. తెలంగాణలో చావు వరకొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. ‘‘రైతులు, యువకులు, నిరుద్యోగులు, మైనార్టీలు, అమరవీరుల కుటుంబాలు, దళిత, గిరిజన, బీసీలు బాగుపడాలని త్యాగాలు చేసి రాష్ట్రం ఇస్తే.. నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు.. నలుగురి చేతిలో బందీ అయ్యారు” అని చెప్పారు. నిజాం నవాబులు శ్రీమంతులు కావడానికి 200 ఏండ్లు పట్టింది.. కానీ గత ఎనిమిదేండ్ల పాలనతో కేసీఆర్‍ వారసులు నిజాం నవాబుల కంటే సిరిసంపదలు, వజ్రవైడుర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‍ ఫ్యామిలీ ఒక తరాన్ని మొత్తం దోచుకుందని ఆరోపించారు. ‘వద్దురో రామచంద్రా.. ఈ కేసీఆర్‍ పాలన.. ఎవరైనా రావాలి.. ఈ పాలనను అంతమొందించాలి..’ అంటూ జనం మౌనంగా రోధిస్తున్నారని రేవంత్​ అన్నారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకే రాహుల్‍గాంధీ వచ్చారని.. రాష్ట్ర ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపి.. వారు పండించిన చివరి గింజ కొనే బాధ్యత కాంగ్రెస్‍ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను, కేసీఆర్‍ కుటుంబాన్ని పది మీటర్ల గోతి తీసి పాతి పెట్టడానికి రాహుల్‍ గాంధీ వచ్చారన్నారు. రాబోయే 365 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. వరంగల్‍ డిక్లరేషన్‍లో ఇచ్చిన ప్రతిమాటకు, హామీకి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

రైతుబంధు పేరుతో.. మిగతావన్నీ కట్‍

‘‘సీఎం కేసీఆర్‍ రైతుబంధు ఇస్తున్నామనే పేరుతో.. రైతులకు రుణమాఫీ, పావలా వడ్డీ, సబ్సిడీ ట్రాక్టర్లు, ఎరువులు, విత్తనాలతో పాటు మద్దతు ధర సైతం కల్పించడంలేదు. ప్రాజెక్టుల పేరుతో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కనీస స్థాయిలో నీరు రావడంలేదు.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

రుణమాఫీ చేయని టీఆర్‍ఎస్‍ను బొందపెట్టాలే 

‘‘రాష్ట్రంలో రుణమాఫీ చేయని టీఆర్‍ఎస్‍ ప్రభుత్వాన్ని రైతులు బొందపెట్టి..గోరి కట్టాలె. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‍దే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని మోడీ.. ఎరువులు, విత్తనాల ధరలను డబుల్‍ చేశారు’’
- ఉత్తమ్‍కుమార్‍రెడ్డి, ఎంపీ

ఆరు నెలల ముందే క్యాండిడేట్‍ ఎవరో చెప్పాలే

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‍ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎన్నికలకు ఆరు నెలల ముందే నియోజకవర్గాల్లో క్యాండిడేట్ల పేర్లు సెలెక్ట్ చేయాలె. తెల్లబట్టలు వేసుకుని ఢిల్లీలో తిరిగే లీడర్లకు కాకుండా నిత్యం జనాల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడేటోళ్లకు టిక్కెట్లు ఇయ్యాలె’’
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ 

దొంగల్లా.. కేసీఆర్‍ ఫ్యామిలీ దోపిడీ

‘‘కేసీఆర్‍ ఫ్యామిలీ దోపిడీ.. స్టూవర్ట్​పురం దొంగలను తలపిస్తున్నది. కేసీఆర్‍ ప్రభుత్వం ఎటువంటి అవినీతికి పాల్పడకుంటే జిల్లా జిల్లాకు పార్టీ ఆఫీసులు.. రూ.800 కోట్లు ఎక్కడివి. పంటినొప్పి వస్తే ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్ వరంగల్​లోని ఎంజీఎంలో ఎలుకలు తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. ఈ దుర్మార్గపు పాలన అంతమొందించాలి’’
- మధుయాష్కీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‍