కోల్ కతా: దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించాడని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను విచారణ నిమిత్తం పోలీసులు సోమవారం (నవంబర్ 11) సీల్దా కోర్టుకు తీసుకువచ్చారు.
సంజయ్ రాయ్‌ను అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారించారు. ఈ కేసు కోల్ కతాతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత నడుమ నిందితుడిని కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు హాల్ తలుపులు మూసి నిందితుడిని విచారించారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టు నుండి జైలుకు వ్యాన్‌లో తరలించారు. ఈ క్రమంలో పోలీస్ వ్యాన్‌లో వెళ్తుండగా మీడియాతో సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు.
ALSO READ | వైరల్ వీడియో: ఛీ..ఛీ.. ఈ కానిస్టేబుల్ గిసొంటి పని చేసిండేంది..!
"వినీత్ గోయల్ మొత్తం కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించాడని నేను మీకు చెప్తున్నాను’’ అని సంజయ్ రాయ్ వ్యాఖ్యానించాడు. కాగా, ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సంజయ్ రాయ్‌ను 2024, ఆగస్ట్ 10వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66, సెక్షన్ 103 కింద రాయ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకుఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేపట్టింది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.