- స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కూడా అరెస్ట్ చేసిన సీబీఐ
- కేసును తప్పుదోవ పట్టించారని అభియోగాలు నమోదు
- లైవ్ స్ట్రీమింగ్ కు అంగీకరించని మమత.. చర్చలకు జూడాలు నో
కోల్ కతా: కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రెయినీ డాక్టర్‌పై రేప్, మర్డర్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు గాను ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను, తలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిజిత్ మోండల్‌ను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. వీరిద్దరూ ఆధారాలను మాయం చేసి.. రేప్ అండ్ మర్డర్ కేసును వీరు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని క్రిమినల్ అభియోగాలు నమోదు చేసింది. ఎస్ హెచ్ వో మోండల్ కావాలనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేశాడని సీబీఐ పేర్కొంది.
అయితే, ఆర్జీ కర్ ప్రభుత్వ హాస్పిటల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో సందీప్ ఘోష్ ను సీబీఐ ఇదివరకే అరెస్టు చేసింది. తాజాగా డాక్టర్ హత్య కేసులో ఆయనపై అభియోగాలు నమోదు చేసి, అరెస్టు చూపుతూ జడ్జి ముందు ప్రవేశపెట్టింది. కాగా, కేసును సాక్షాత్తు పోలీసులే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తేలిపోయిందని, అందుకే సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, కోల్ కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు.
నో లైవ్ స్ట్రీమింగ్.. నో డైలాగ్
లైవ్ స్ట్రీమింగ్కు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామని బెంగాల్ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు మరోసారి తేల్చి చెప్పారు. లేదంటే సమావేశానికి హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు. ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని కోరుతూ కొద్ది రోజులుగా జూడాలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ శనివారం వెళ్లారు. డ్యూటీలో చేరాలని జూడాలకు విజ్ఞప్తి చేశారు.
అయితే తమ డిమాండ్లపై చర్చలు జరిపితేనే ఆందోళన విరమిస్తామని జూడాలు తేల్చి చెప్పారు. దీంతో జూడాలను మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సీఎం మమతతో చర్చలు జరిపేందుకు శనివారం సాయంత్రం జూడాల బృందం ఆమె ఇంటికి వెళ్లింది. అయితే చర్చల సమావేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు సర్కార్ ఒప్పుకోలేదు. కానీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తేనే సమావేశానికి వస్తామని జూడాలు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వం, జూడాల మధ్య ఎలాంటి సమావేశం జరగలేదు.