ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్

సంచలనాలు, కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎఫెక్ట్ ఏపీ రాజకీయాలకు గట్టిగా తగిలింది. సరిగ్గా ఎలక్షన్స్ టైంలో ఈ సినిమా రావడంతో టోటల్ గా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉండటంతో ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్. పూర్తిగా లక్ష్మీపార్వతి వైపు నుంచే ఈ సినిమాను తీసిన వర్మ.. ఎన్టీఆర్‌ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అంశాన్ని హైలైట్ చేసి చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల కావడంతో చంద్రబాబుపై ప్రతిపక్షాల విమర్శల జోరు ఎక్కువైంది. పలువురు ఈ సినిమా మీడియా, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భార్య బసవతారకం స్నేహితురాలు డాక్టర్ కుసుమరావు ఓ యూట్యూబ్ చానల్‌ తో మాట్లాడారు. అయితే.. ఎన్టీఆర్‌ కు చంద్రబాబు వెన్నపోటు పొడిచారనడం సరికాదన్నారు. ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం పరంగా ఎన్నో చిక్కు సమస్యలను చంద్రబాబు చాలా సమర్థవంతంగా పరిష్కరించారని కుసుమరావు తెలిపారు. ఎన్టీఆర్‌కు కుడిభుజంగా ఉన్న చంద్రబాబును లక్ష్మీపార్వతి సూచన మేరకు ఎన్టీఆర్ అన్ని పదవుల నుంచి దూరం పెట్టారని చెప్పుకొచ్చారు.

ఇటీవల మోహన్ బాబు మాట్లాడుతూ..వైస్ రాయ్ హోటల్ దగ్గర చంద్రబాబు అన్నగారు ఎన్టీఆర్ పై చెప్పులతో కొట్టించడం వాస్తవమేనని చెప్పాడు. మరికొంత మంది మాత్రం వర్మ జరిగిందే చూపించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి పక్షాలు మాత్రం దొరికిందే ఛాన్స్ అనేలా చంద్రబాబుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆసరాగా తీసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి వర్మ లక్ష్మీస్ ముందు ముందు ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలంటున్నారు సినీ విశ్లేషకులు.