హైదరాబాద్: ఏపీలో వివిధ చోట్ల తనపై నమోదైన కేసులపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఆదివారం (డిసెంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాపై 5 కేసులు పెట్టడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. నా ట్వీట్ల వెనక రాజకీయ దురుద్దేశం లేదని.. కేవలం ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకే ట్వీట్లు పెట్టానన్నారు. నేను పోలీసులకు బయపడి ఎక్కడికి పారిపోలేదని.. హైదరాబాద్‌లోని డెన్లోనే ఉన్నానన్న ఆర్జీవీ.. అరెస్ట్ చేస్తారన్న సమాచారంతోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు.
పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆన్సర్ ఇచ్చానని.. నా రిప్లైయ్పై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న అభియోగాలపై ఆర్జీవీపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వివిధ స్టేషన్లలో రాంగోపాల్ వర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ఇందులో భాగంగానే విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి రెండు సార్లు నోటీసులు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పోలీసుల విచారణకు రెండుసార్లు ఆర్జీవీ డుమ్మా కొట్టారు. దీంతో రాంగోపాల్ వర్మను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు నేరుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. ఆ సమయంలో రాంగోపాల్ వర్మ ఇంట్లో లేకపోకపోవడంతో ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూసి చేసేదేమి లేక పోలీసులు వెనుదిరిగారు.