ఆర్జీవీని రాష్ట్ర బహిష్కరణ చేయాలి: మేడా శ్రీనివాస్ డిమాండ్

ఆర్జీవీని రాష్ట్ర బహిష్కరణ చేయాలి: మేడా శ్రీనివాస్ డిమాండ్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకాతిరుమల రావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెవో వర్రే అప్పారావు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఆర్జీవీ మాట్లాడుతున్నారని.. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ -తెలంగాణా ప్రాంతాల మధ్య ఆశాంతికి ఆర్జీవీ ఆజ్యం పోస్తున్నారని.. ఇరు రాష్ట్ర ప్రజల మధ్య శాంతి భద్రతల సమస్యలకు ఆయన కుట్ర చేస్తున్నారని అన్నారు. ఆంధ్రుల మనోభావాలను దెబ్బ తీస్తోన్న రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు.  సోషల్ మీడియాలో అఖండ భారతీయులు ఎంతో పవిత్ర గ్రంథాలుగా కొలిచే రామాయణ, మహాభారతాలను.. సనాతన హిందూ ధర్మ దైవ మూర్తులను అవమానించే విధంగా మతోన్మాద ఉన్మాద చర్యలను ఆర్జీవీ ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. 

ALSO READ | శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలి.. రేవతి ఫ్యామిలీకి అండగా ఉంటా: అల్లు అర్జున్ ప్రకటన

ఆర్జీవీ పశుకామ పైశాచిక ప్రవర్తనలను బహిరంగంగా వీడియోలు తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి యువత భవిష్యత్‎ను కలుషితం చేస్తున్నాడని.. కుటుంబ కట్టుబాటులను, సాంప్రదాయాలను విచ్చిన్నం చేస్తున్నారన్నారు. ఆర్జీవీ అన్యమత పాశ్చాత్య ఉగ్రవాద శక్తులతో సంబంధాలు పెట్టుకుని సనాతన హిందూ ధర్మంపైన విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.ఎంతో ఖ్యాతి గల భారతీయ చరిత్రకు మకిలి పట్టించే విధంగా కొంతమంది కిరాయి యాంకర్స్‎తో కలసి ఆర్జీవీ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు.