సూర్యాపేట, వెలుగు: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారంటూ ఆత్మకూరు(ఎస్) చెందిన బాధితులు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయాకు ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. ఆత్మకూర్ (ఎస్) మండలం దాచారం గ్రామానికి చెందిన పొలగాని కవిత– సైదులు దంపతుల కుమారుడు సిద్ధార్థ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలని ఆన్లైన్లో బాధితులు దరఖాస్తు చేశారు. ఎంక్వైరీ పూర్తి అయ్యి సుమారు 15 రోజులు కావస్తున్నా నేటికీ సర్టిఫికేట్ రాకపోవడంతో ఆర్ఐ అంజయ్యని కలిసి అడిగారు. సర్టిఫికెట్ కావాలంటే రూ.10 వేలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇవ్వలేం, రూ.5 వేలు ఇస్తామని సర్టిఫికెట్ ఇవ్వండని బాధితులు ప్రాధేయపడినా ఆర్ఐ పట్టించుకోలేదు.
ఆర్ఐ వేధింపులు తట్టుకోలేక అధికారులకు ఫిర్యాదు చేద్దామని గురువారం మండలం ఆఫీస్కు బాధితులు వచ్చారు. అక్కడే ఉన్న సందీప్ కుమార్ సుల్తానీయాను బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పారు. దీంతో సందీప్ సుల్తానీయా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ వెంకటరావును ఆదేశించారు.