- పంట చేతికొచ్చే దశలో తెగుళ్ల ప్రభావంతో రాలిపోతున్న వరి గింజలు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 2.60 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. నిరుడు యాసంగి కంటే లక్షా ఎకరాల్లో వరి అధికంగా సాగైంది. భారీ వర్షాలు కురవడం, చెరువులు, కుంటలు,బోర్లలో నీళ్లు అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు వరి సాగుకు ఆసక్తి చూపారు. ఈ సీజన్లో ఫస్ట్ నుంచే వరి పంటపై తెగుళ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. నాటు వేసిన 20 రోజుల్లోనే అగ్గి తెగులు వ్యాపించింది. పంట ఎర్రగా మారి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభావం జిల్లాలోని చాలా ఏరియాల్లో కనిపించింది. అప్పడు ఎకరాలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేసి మందులు పిచికారీ చేశారు. ఇప్పుడు పంట చేతికొచ్చింది. కొన్ని ఏరియాల్లో కోతలు కూడా షురూ అయ్యాయి. చాలా ఏరియాల్లో పొట్ట దశ, గింజలు ఏపుగా పెరిగే దశలో ఉన్నాయి. ఫస్ట్‌లో వచ్చిన అగ్గి తెగులు, కాండం తొలుచు ప్రభావంతో పంట కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో కంకులు తెల్లగా మారి గింజలు రాలిపోతాయి. తెగుళ్ల ప్రభావం పైరులోనే ఉండి ఫంగస్‌గా ఏర్పడి ఈ పరిస్థితి వచ్చిందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.
వేలాది ఎకరాల్లో ప్రభావం
జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, లింగపేట,రాంజంపేట, నాగిరెడ్డిపేట, రామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో తెగుళ్ల ప్రభావం కనిపిస్తోంది.
దిగుబడిపై ఎఫెక్ట్
వరి చివరి దశలో ఉండగా కంకులు తెల్లగా మారి విత్తులు రాలిపోతుండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది . దీంతో దిగుబడి తగ్గనుంది. యాసంగిలో ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వారే పేర్కొంటున్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
సగం కూడా వస్తయో.. రావో..
నేను 3 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నా. పంట కొద్ది రోజుల్లో చేతికొచ్చే దశలో ఉంది. ఇప్పుడు తెగుళ్లతో కంకులు తెల్లబడి గింజలు రాలిపోతున్నాయి. మందులు తెచ్చి స్ప్రే చేసినా తగ్గడం లేదు. దిగుబడి సగం కూడా వస్తుందా లేదా అనిపిస్తుంది. పంట వేసినప్పుడు అగ్గితెగులు వచ్చింది. మొత్తం సీజన్లో మందుల స్ప్రేకే రూ.7 వేలు ఖర్చయింది. సాగుకు రూ.60 వేల దాకా అయింది. నా పొలమే కాదు.. మా ఊరిలోని చాలా మంది పొలాల్లో వరి కంకులు తెల్లగా మారి గింజలు రాలిపోతున్నాయి.
–అల్లే శ్రీనివాస్, భవానిపేట, మాచారెడ్డి
సగం గింజలు రాలిపోతున్నయ్
నేను రెండున్నర ఎకరాల్లో వరి పంట వేశాను. సాగుకు
రూ. 50 వేల దాకా ఖర్చయింది. మొదట్లో అగ్గి తెగులు సోకింది. పలుమార్లు మందులు కొట్టాను. తీర పంట చివరి దశకు చేరే సరికి కంకులు తెల్లగా అయి గింజలు పొల్లుగా మారుతున్నయ్. పొలంలో సగం ఇలాగే గింజలు రాలిపోతున్నాయి.
–స్వామి, జనగామ, బీబీపేట మండలం
కంటిన్యూగా ఒకే పంట వేయడంతో ప్రభావం
కంటిన్యూగా ఒకే రకం పంట వేయడంతో తెగుళ్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. భూమిలో ఎప్పుడూ వరి పంటనే వేస్తే పోషకాలు లోపిస్తాయి. పోషకాలు తగ్గితే తెగుళ్ల ప్రభావం అధికంగా ఉంటుంది. తెగుళ్ల వ్యాప్తిపై ఎప్పటికప్పుడు మా శాఖ ద్వారా రైతులను అలర్ట్ చేస్తున్నాం.
–భాగ్యలక్ష్మి, కామారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్