వరినాట్లకు  పంట పొలాలు సిద్ధం...  రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

వరినాట్లకు  పంట పొలాలు సిద్ధం...  రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలు  వరి సాగుకు రైతాంగం సన్నద్ధం అయ్యారు. దాదాపుగా అన్ని గ్రామాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.   సన్న చిన్న కారు రైతులు తమకున్న కొద్ది పాటి భూమిలో ఇప్పుడు వరి నాటు వేస్తున్నారు.  అయితే వరి నాటు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోక పంట దిగుబడి తగ్గుతుందని  వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.  వరి నాటుకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . .

వరి నారును సరైన పద్దతిలో నాటకపోతే వివిధ తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది.శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యవంతమైన నారును తయారు చేసుకొని చదరపు మీటరుకు 33 కుదుళ్ళ చొప్పున నాటినట్లయితే గాలి, వెలుతురు బాగా సోకి మొక్క అధిక పిండిపదార్థాలను తయారు చేసుకుంటుంది.అప్పుడు అధిక దిగుబడులు లభిస్తాయి. ఆగస్టు మాసంలో వరి నాట్లు వేసే రైతులు దిగువ సూచించిన జాగ్రత్తలు పాటించాలి.ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రధానంగా ఆగస్టులో వరినాట్లు వేస్తారు.

నాట్లకు పొలం తయారీ

నాట్లు వేయటానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి 2-3 దఫాలుగా మురగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో గాని, అడ్డతోగాని చదును చేయాలి. రేగడి భూముల్లో నాట్లు వేయటానికి 2 రోజుల ముందుగానే దమ్ము పూర్తి చేసి, ఆ తర్వాత నాట్లు వేస్తే మంచిది.

నాటు వేసేందుకు  నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగాతిరుగుతుంది. నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన వేస్తే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్నిబట్టి ఖరీఫ్ లో చ.మీ.కు 33 మూనలు ఉండేలా చూడాలి. ఆలస్యంగా ముదురు నారు వేసేటప్పుడు చ.మీ.కు 44 మూనలు తగ్గకుండా నాటుకోవాలి. బాగా మెత్తగా/ బరువైన నేలల్లో దమ్ము చేసిన 2-10 రోజులలోపు నాట్లు వేయటం ముగించాలి.

నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. బాటలు తీయటం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయటానికి ఇంకా పైరు పరిస్థితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి.

ఆరోగ్యవంతమైన నారు పెంపకం

  • నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ముచేసి చదును చేయాలి.
  • నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేయాలి.
  • 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని (విత్తనం చల్లేముందు 1 కిలో, మరో కిలో విత్తిన10 నుంచి 15 రోజులకు),1 కిలో భాస్వరం,1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి.
  •  శిలీంధ్రనాశనితో శుద్ధి చేసి మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లాలి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడిగా నీరు పెట్టి, తర్వాత పలుచగా నీరు నిల్వకట్టాలి.
  •  జింకు లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
  •  విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రా. చొప్పున వేయాలి లేదా క్లోరిపైరిఫాస్ 2 మి.లీ./ లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారీ చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రా. కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వేయాలి.
  • మండె కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో సమానంగా పలుచటి నీటి పొర ఉంచి విత్తుకోవాలి. మరుసటి రోజు నారు మడిలో నీటినిమొత్తం తీసివేయాలి.