మెదక్ (శివ్వంపేట), వెలుగు: వీఆర్‌ఏలు క్యూ పద్ధతి పాటించకుండా పైసలిచ్చిన వాళ్ల లారీలు, ట్రాక్టర్లలోని వడ్లను ఖాళీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. శుక్రవారం శివ్వంపేటలోని శ్రీసాయి వెంకటరమణ రైస్ మిల్లు దగ్గర తూప్రాన్–నర్సాపూర్ రోడ్డుపై ట్రాక్టర్లు అడ్డంపెట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్‌ఏలు ట్రాక్టర్‌కు రూ.2 వేలు ఇస్తే వెంటనే ఖాళీ చేయిస్తున్నారని, లేదంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వారం కింద వడ్లు తీసుకొచ్చిన లారీలు, ట్రాక్టర్లను కాదని, ఇవాళ వచ్చిన వడ్లను ఖాళీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సంచికి రెండు, మూడు కిలోలు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ అక్కడికి చేరుకోగా.. కనీసం పర్యవేక్షణ చేయకపోతే ఎలా అని ఆయనతో వాగ్వాదానికి దిగారు. మిల్లు యజమానితో మాట్లాడి లారీలు, ట్రాక్టర్లలోని వడ్లను త్వరగా ఖాళీ చేయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.