రూ.62.20 కోట్ల సీఎమ్మార్ రైస్ మిల్లర్ పక్కదారి

రూ.62.20 కోట్ల సీఎమ్మార్ రైస్ మిల్లర్ పక్కదారి

కరీంనగర్, వెలుగు: నిరుడు వానాకాలం, యాసం గిలో మరాడించి ఇచ్చేందుకు సర్కార్ అప్పగించిన వడ్లను జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన రైస్ మిల్లర్ దారి మళ్లించాడు. రూ.62.20 కోట్ల విలువైన బియ్యాన్ని బయట అమ్ముకుని చేతులెత్తేశాడు. దీంతో జిల్లా సివిల్ సప్లయీస్ ​మేనేజర్ రజనీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మికుంట రూరల్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. 

జమ్మికుంట మండలంలోని కోరపల్లిలోని మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీ ఓనర్ బండారి మారుతికి 2022--–23 యాసంగి, 2023–--24 వానాకాలం సీజన్​లో మరాడించి బియ్యంగా ఇచ్చేందుకు 1,96,620.14 క్వింటాళ్ల వడ్లను అప్పగించారు. అయితే, ఆ వడ్లను బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించకుండా.. బయట ఎక్కువ రేటుకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. ఫలితంగా సర్కార్​కు రూ.62,20,64,821 నష్టం వాటిల్లింది. పలుమార్లు జిల్లా సివిల్ సప్లయీస్ ​విభాగం ఆఫీసర్లు మొక్కుబడిగా నోటీసులు  పంపారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత సర్కార్ హయాంలో సీఎంఆర్ ఎగ్గొట్టిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం

ప్రత్యేక దృష్టి సారించడంతో మారుతి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో సివిల్ సప్లయీస్ ​డీఎం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ రవి తెలిపారు. ఇన్నాళ్లూ మామూళ్ల మత్తులో ఉండి సర్కార్ అప్పగించిన వడ్లు ఉన్నాయో, లేవో చూసుకోకుండా, కోట్లాది రూపాయల విలువైన బియ్యం పక్కదారి పట్టినా పట్టించుకోని జిల్లా ఆఫీసర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరో మిల్లులోనూ భారీ వ్యత్యాసం.. 

ఇదిలా ఉండగా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో ఇదే వ్యాపారికి చెందిన సీతారామ ఆగ్రో ఇండస్ట్రీలోనూ కోట్లాది రూపాయల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు తెలిసింది. స్టాక్ రిజిస్టర్​లో ఉన్న ధాన్యం నిల్వల రికార్డులను జగిత్యాల డీఎస్ఓ వెంకటేశ్వర్లుతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, సివిల్ సప్లయీస్​అధికారులు వినోద్, ఏఎస్ఐ రవితో కూడిన అధికారుల బృందం గురువారం పరిశీలించగా భారీ తేడాలను గుర్తించారు.