గద్వాల, వెలుగు: రైస్ మిల్లర్లు, సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు కుమ్మక్కై సీఎంఆర్ వడ్లను ఇష్టానుసారంగా దింపేసుకుంటున్నారు. అగ్రిమెంట్లు లేకుండా, ష్యూరిటీలు ఇవ్వకుండా లారీల కొద్దీ వడ్లను మిల్లర్ల కు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 2021– 22 రబీ లెవీ రైస్‌ను ఇవ్వని మిల్లులకు కూడా అగ్రిమెంట్లు లేకుండా వడ్లు దింపడం అనుమానాలకు తావిస్తున్నది. 41 రైస్ మిల్లులు ఇంకా 30% లెవీ బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. కానీ 2022–- 23 రబీ కింద 33 వేల మెట్రిక్ టన్నుల వడ్లను 33 రైస్ మిల్లులకు ఇచ్చారు. కానీ రూల్స్ పాటించకుండా సీఎంఆర్ వడ్లను మిల్లులకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
ఇష్టారాజ్యంగా అగ్రిమెంట్లు
సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు రైస్ మిల్లర్లతో ఇష్టారాజ్యంగా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 1 నుంచి ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా మిల్లులకు 33 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ వడ్లను దింపారు. 12న అగ్రిమెంట్ చేసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. కానీ 25న రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అగ్రిమెంట్ చేసినట్లు కొన్నిచోట్ల సంతకాలు చేశారు. ఇలా పొంతన లేకుండా అగ్రిమెంట్లు ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అగ్రిమెంట్ల తేదీల్లో మార్పులు ఉన్నప్పటికీ జూన్ 1 నుంచి మిల్లులకు వడ్లు పంపించడం కొసమెరుపు. చింతలకుంటలోని ఒక రైస్ మిల్లుకు ట్రాకింగ్ ఉన్నా గద్వాలలోని రైస్ మిల్లుకు వడ్లు పంపడాన్ని పలువురు మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. గత రబీకి సంబంధించి 8 మిల్లులు లేవీ బియ్యం ఇవ్వకున్నా వాటికి ఇప్పుడు మళ్లీ వడ్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
గత రబీ సీఎంఆర్ లేవీ బియ్యం పెట్టలే
2021-–22 రబీ సీజన్ కు సంబంధించి 41 రైస్ మిల్లులకు 85,602 వేల మెట్రిక్ టన్నుల వడ్లను సీఎంఆర్ కింద కేటాయించారు. మే 30వ తేదీకి మొత్తం కంప్లీట్ గా లెవీ బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు 57,621 మెట్రిక్ టన్నుల లేవీ బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 39,137 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. 2022- –23 సీజన్ ఖరీఫ్ కు సంబంధించి 50 మిల్లుల నుంచి18వేల మెట్రిక్ టన్నుల లేవీ బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక రైస్ మిల్ మాత్రమే 500 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వగా మిగతా 49 రైస్ మిల్లులు ఒక క్వింటాలు బియ్యం కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు మూడు శాతం లేవీ బియ్యం మాత్రమే ఇచ్చారు. గత రబీ, ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు 33,000 వేల మెట్రిక్ టన్నుల వడ్లను 33 రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నది.
దందా చేస్తున్న రైస్ మిల్లర్లు
సీఎంఆర్ వడ్లతో రైస్ మిల్లర్లు దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేయడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా మారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. చాలామంది మిల్లర్లు లేవీ వడ్లను రాయచూరు తదితర ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారు. వాటి స్థానంలో రీసైక్లింగ్ రేషన్ బియ్యాన్ని పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆరు రైస్ మిల్లు నుంచి 20 కోట్ల సీఎంఆర్ రావాల్సి ఉంది. అందులో కేవలం మూడు రైస్ మిల్లులు మాత్రమే 11 కోట్లకు పైగా సీఎంఆర్ వడ్లను
వాడుకున్నారు.
వడ్లు లేకున్నా ఉన్నట్లు రిపోర్టులు
సివిల్ సప్లయీస్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ వడ్లు పెట్టిన ప్రతిమిల్లుకు ఒక డీటీ( డిప్యూటీ తహసీల్దార్) ఇన్ చార్జిగా ఉంటారు. తరచూ రైస్ మిల్లులను తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది రబీ వడ్లు పక్కదారి పట్టినా వడ్లు మిల్లులలో నిల్వ ఉన్నట్లు రిపోర్టులు ఇచ్చారు. తరువాత అసలు మిల్లులలో వడ్లే లేవని విషయం బయటకు వచ్చింది. దీంతో కలెక్టర్ మిల్లులపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆఫీసర్లకు సూచించారు. మూడు మిల్లులపై కేసు పెట్టినా, ఇంకా నాలుగు రైస్ మిల్లులకు విజిలెన్స్, సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు సపోర్ట్ చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీటీలపైలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రతీ బియ్యపు గింజ తీసుకుంటాం..
మిల్లులకు ఇచ్చిన ప్రతి బియ్యపు గింజ తీసుకుంటాం. రైతులకు ఇబ్బంది కలవద్దనే అగ్రిమెంట్లు చేసుకోకుండా రైస్ మిల్లులకు వడ్లు ఇచ్చాం. లెవీ రైస్ పెట్టని మిల్లులపై ఆర్ఆర్ యాక్టివ్ కింద రికవరీ చేస్తాం. అగ్రిమెంట్ల తేదీల్లో మార్పులతో ఏమీ ఇబ్బంది ఉండదు.
_–రేవతి, డీఎస్ఓ, గద్వాల