బియ్యం బకాయిలు లక్షా 6 వేల మెట్రిక్ టన్నులు

బియ్యం బకాయిలు  లక్షా 6 వేల మెట్రిక్ టన్నులు
  • నిన్నటితో ముగిసిన సీఎంఆర్ గడువు
  • మొండికేస్తున్న మిల్లర్లు
  • 2023–24 ఖరీఫ్, రబీ సీజన్ ధాన్యం మిల్లింగ్​పై నిర్లక్ష్యం

నిర్మల్, వెలుగు: సీఎంఆర్ బియ్యం అప్పజెప్పే విషయంలో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మల్​జిల్లాలో 2023–24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సీఎంఆర్ బియ్యం చెల్లింపు విషయంలో ఇప్పటికే పలు సార్లు గడువు విధించిన ప్రభుత్వం మరో సారి ఈ నెల 15 వరకు గడువు పెంచింది. ఆదివారంతో ఈ గడువు ముగిసినప్ప టికీ రైస్ మిల్లర్లు మాత్రం ఇంకా వానాకాం కోటాకు అనుగుణంగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్ప లేదు. జిల్లాలో 2023–24 సీజన్​కు గానూ లక్షా 42 వేల 759 మెట్రిక్​టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించింది. దీనికనుగుణంగా రైస్ మిల్లర్లు 95,942 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 79,326 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 16,616 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది.

రబీ సీజన్ సీఎంఆర్ పరిస్థితి అంతే..

2023–24 రబీ సీజన్​కు సంబంధించి రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మిల్లర్లు మాత్రం సీఎంఆర్ ను తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం అధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ సీజన్ కు సంబంధించి లక్షా 56 వేల 847 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం జిల్లాలోని మిల్లర్లకు కేటాయించారు. 

ఇందుకు లక్షా 5 వేల 697 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలి. కానీ ఇప్పటివరకు కేవలం 15,067 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పజెప్పారు. ఇంకా 90,090 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఈ బకాయిపడ్డ సీఎంఆర్ బియ్యాన్ని ఈ నెల 15లోగా ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించించినా మిల్లర్లు అప్పజెప్పలేదు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మొత్తంగా లక్షా 6 వేల మెట్రిక్​టన్నులు బకాయిలు ఇవ్వాలి.

మాయమైన ధాన్యంపై చర్యలు కరువు

జిల్లాలో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టు అధికారుల తనిఖీల్లో గతంలో వెల్లడైంది. మొత్తం 16 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా అధికారులు ప్రకటించడమే కాకుండా అవకతవకులకు పాల్పడ్డ మరో ఏడు రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 2022–23 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి 7 రైస్ మిల్లులు ఏకంగా రూ.107 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే బ్యాంకు గ్యారంటీల విషయంలో కూడా చాలా మంది రైస్ మిల్లర్లు అనేక రకాల తిరకాసులు పెట్టారు. అయినా వారిపై చర్యలు కరువయ్యాయి.