నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్​మిల్లర్లు

  • సీఎమ్మార్​​.. క్వాలిటీ పూర్
  • నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్​మిల్లర్లు
  • ఆ బియ్యమే పీడీఎస్​ ద్వారా పేదలకు పంపిణీ​
  • స్కూళ్లు, హాస్టళ్ల సన్నబియ్యం కూడా నాసిరకమే
  • సివిల్ సప్లయీస్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
  • విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ నాసిరకం బియ్యం
  • ఈమధ్యనే12 మంది టెక్నికల్ అసిస్టెంట్ల సస్పెన్షన్​

మంచిర్యాల, వెలుగు:   రాష్ర్టంలో  సీఎమ్మార్​ (కస్టమ్ మిల్లింగ్ రైస్)  ప్రక్రియ పూర్తిగా  దారితప్పింది.  ఫలితంగా రైస్​మిల్లుల నుంచి సివిల్ సప్లయీస్​కు వచ్చే బియ్యంలో  క్వాలిటీ లోపించింది.  మిల్లర్లు ఆఫీసర్లతో  కుమ్మక్కై నాసిరకం బియ్యాన్ని సప్లై చేస్తున్నారు.  గవర్నమెంట్ స్కూళ్లకు,  హాస్టళ్లకు పంపిణీ చేసే సన్నబియ్యానిది అదే పరిస్థితి.  బియ్యంలో ప్రభుత్వం సూచించిన దానికంటే ఎక్కువ  నూకలు ఉంటున్నాయి.  కొన్నిచోట్ల రంగుమారి వాసన పట్టిన బియ్యం కూడా వస్తున్నాయి. కొంతమంది మిల్లర్లు  పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తూ  సీఎమ్మార్  కింద అప్పగిస్తున్నారు. ఇవన్నీ సివిల్ సప్లయీస్​ స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీల్లో తేలిన నిజాలే.  ఈమధ్య పలు జిల్లాల నుంచి సీఎమ్మార్ క్వాలిటీపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విజిలెన్స్ ఆఫీసర్లు రంగంలోకి దిగి  ఎస్​డబ్ల్యూసీ (స్టేట్ వేర్​హౌసింగ్​ కార్పొరేషన్) గోడౌన్లలో,   ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాకిస్ట్) పాయింట్లలో తనిఖీలు చేశారు. వందల క్వింటాళ్ల నాసిరకం బియ్యం నిల్వలు గుర్తించారు. దీనికి బాధ్యులుగా రాష్ర్టవ్యాప్తంగా 12 మంది టెక్నికల్ అసిస్టెంట్లను ఇటీవల సస్పెండ్​ చేశారు.

నో క్వాలిటీ చెకింగ్..

రాష్ర్ట ప్రభుత్వం పీడీఎస్​కు అవసరమైన బియ్యాన్ని సివిల్ సప్లయీస్​ కార్పొరేషన్ ద్వారా మిల్లుల నుంచి డైరెక్ట్​గా సేకరిస్తోంది. కొనుగోలు సెంటర్ల  ద్వారా రైతుల దగ్గర కొన్న వడ్లను రైస్​మిల్లులకు ఇస్తోంది. మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని సేకరించి స్టేజ్ వన్ గోదాముల్లో నిల్వ చేస్తోంది. అక్కడి నుంచి ప్రతీ నెల ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించి రేషన్ షాపులకు సప్లై చేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడా రూల్స్ ప్రకారం క్వాలిటీ చెకింగ్ జరగడం లేదు. గతంలో లెవీ సిస్టం అమలులో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎఫ్​సీఐ ద్వారా బియ్యాన్ని సేకరించి రాష్ర్టాలకు కేటాయించేది. 2013లో లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ర్ట సీఎం కిరణ్​కుమార్​ రెడ్డి  ‘మన బియ్యం’ పేరిట కొత్త స్కీం తీసుకొచ్చారు.

దాని ప్రకారం రాష్ర్టానికి అవసరమైన బియ్యాన్ని ప్రభుత్వమే సీఎమ్మార్ ద్వారా సేకరించుకుంటోంది. సబ్సిడీ మొత్తాన్ని ఎమ్మెస్పీ రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి చెల్లిస్తోంది. అప్పుడు బియ్యం క్వాలిటీ విషయంలో ఎఫ్​సీఐ రూల్స్ పకడ్బందీగా అమలు చేసేది.  ‘మన బియ్యం’ స్కీంతో రైస్ క్వాలిటీ దెబ్బతినగా రాష్ర్టంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా దిగజారింది. సివిల్ సప్లయీస్​ కార్పొరేషన్​లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. మరోవైపు సిబ్బంది కొరత కారణంగా ఎఫ్​సీఐలో పనిచేసి రిటైర్ అయిన వాళ్లను ఔట్​సోర్సింగ్​లో  టెక్నికల్ అసిస్టెంట్లుగా రిక్రూట్​ చేస్తోంది. వీళ్లు కూడా సరిపడా లేకపోవడంతో  క్వాలిటీ చెకింగ్ కాగితాలకే పరిమితవుతోంది. 

రీసైక్లింగ్​తో మరింత నాసిరకం..

పీడీఎస్ బియ్యం అసలే క్వాలిటీ లేకపోగా రీసైక్లింగ్ వల్ల మరింత నాసిరకంగా ఉంటున్నాయి.  చాలామంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్​లో  కిలో  రూ.30 చొప్పున అమ్ముకుంటున్నారు.  టైమ్​కు  సీఎమ్మార్ ఇవ్వకపోవడంతో ఎఫ్​సీఐ ఆఫీసర్లు మిల్లుల్లో తనిఖీలు చేసినప్పుడు ఈ విషయం బయటపడింది. ఎఫ్​సీఐకి, సివిల్ సప్లయీస్​కు బాకీ ఉన్న  సీఎమ్మార్ లోటును పూడ్చుకునేందుకు మిల్లర్లు రీసైక్లింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. రేషన్ బియ్యం క్వాలిటీ లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు బయోమెట్రిక్ వేసి కిలోకు రూ.10 చొప్పున డీలర్లుకు అమ్ముతున్నారు. కొందరు చిరువ్యాపారులు ఊరూరు తిరిగి కొనుగోలు చేసిన బియ్యాన్ని దళారులకు కిలో రూ.15కు అమ్ముతున్నారు. వాళ్లు బడా వ్యాపారులకు,  రైస్​మిల్లర్లకు రూ.20 నుంచి రూ.22కు విక్రయిస్తున్నారు.  ప్రతీ నెల పంపిణీ చేస్తున్న కోటాలో సుమారు 70 నుంచి 80 శాతం బియ్యం పక్కదారి పడుతున్నాయి.  అందులో 40 శాతం మళ్లీ లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఈ క్రమంలో బియ్యం మిల్లింగ్ చేసి ఎక్కువ రోజులు కావడంతో పాడవుతున్నాయి. ఎఫ్​సీఐ క్వాలిటీ విషయంలో  స్ట్రిక్ట్​గా ఉండడంతో సివిల్ సప్లయీస్​ ఆఫీసర్లను ‘మేనేజ్’ చేసి ఆ బియ్యాన్ని పీడీఎస్​కు అంటగడుతున్నారు. 

కలర్ టెస్టింగ్ చేయట్లే.. 

సీఎమ్మార్ క్వాలిటీని గుర్తించేందుకు, రేషన్  బియ్యం రీసైక్లింగ్ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం కలర్  టెస్టింగ్ సిస్టం తీసుకొచ్చింది. కలర్ టెస్టింగ్​లో మిథైల్ రెడ్, బ్రోమోథైమోల్ బ్లూ, ఇథైల్ ఆల్కహాల్, ప్యూరిఫైడ్ వాటర్ లిక్విడ్​లో ఐదు గ్రాముల బియ్యం వేసి నిమిషం పాటు ఉంచితే రంగు మారుతాయి.  ఆ రంగు ఆధారంగా బియ్యం మిల్లింగ్  చేసి ఎంత కాలం అవుతోందనే విషయాన్ని నిర్ధారిస్తారు. ఆకుపచ్చ రంగు వస్తే  నెలలోపు మిల్లింగ్ చేసినట్టు, లేత ఆకుపచ్చ రంగులోకి మారితే ఒకటి నుంచి రెండు నెలలు, పసుపు రంగు వస్తే మూడు నెలలు,  పసుపుతో కూడిన నారింజ రంగులోకి మారితే నాలుగు నెలలు, నారింజ రంగు వస్తే ఆరు నెలలు కిందట మిల్లింగ్ చేసినట్టుగా తెలిసిపోతుంది. 

ఇదీ పరిస్థితి... 

మంచిర్యాల జిల్లాలోని పలువురు రైస్​మిల్లర్లు క్వాలిటీ లేని బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) కింద సివిల్ సప్లయీస్​కు అప్పగిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అలాగే ప్రభుత్వం మిల్లింగ్ కోసం ఇచ్చిన వడ్లను అమ్ముకున్న మిల్లర్లు  పీడీఎస్ రైస్​ను రీసైక్లింగ్ చేస్తున్నారని కంప్లైంట్స్​ వెళ్లాయి. దీంతో స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్లు బెల్లంపల్లి, మందమర్రి ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేసి వందల క్వింటాళ్ల నాసిరకం బియ్యాన్ని గుర్తించారు. దీనికి బాధ్యుడైన టెక్నికల్ అసిస్టెంట్​ను  టెర్మినేట్ చేశారు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎస్​డబ్ల్యూసీ గోడౌన్లకు ఇటీవల క్వాలిటీ లేని సీఎమ్మార్ వచ్చినట్టు స్టేట్ సివిల్ సప్లయీస్​ ఆఫీసర్లకు  గత నెలలో  కంప్లైంట్ వెళ్లింది. దీంతో ఆఫీసర్లు గోడౌన్లలో తనిఖీలు చేసి హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలోని ఒక రైస్​మిల్లు నుంచి ఈ బియ్యం వచ్చినట్టు గుర్తించారు.  ఆ మిల్లు నుంచి వచ్చిన 2,320 బస్తాల బియ్యాన్ని వాపస్ చేశారు. 

సివిల్ సప్లయీస్​ డిపార్ట్​మెంట్​ ద్వారా పీడీఎస్ రైస్​తో పాటు స్కూళ్లు, హాస్టళ్లకు సప్లై చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉంటున్నాయని ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో  స్టాక్ పాయింట్లలో రవాణాకు సిద్ధంగా ఉన్న 75 కన్​సైన్​మెంట్ల బియ్యం నాసిరకంగా ఉన్నట్టు స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ల పరిశీలనలో తేలింది. మిల్లర్ల నుంచి వచ్చే బియ్యం నాణ్యత పరీక్షలు నిర్వహించని 12 మంది టెక్నికల్ అసిస్టెంట్లను ఇటీవల తొలగించారు. 

ఏప్రిల్​ 26న జమ్మికుంటలో క్వాలిటీ సరిగా లేవని 8 లారీల బియ్యాన్ని  రాష్ట్ర గిడ్డంగుల గోదాం సూపర్​వైజర్​ సత్యనారాయణ వాటిని రిజెక్ట్ చేశారు. నాలుగు ఏసీకే ల లారీలను నిరాకరించారు. ఒక్కొక్క ఏసీకేలో సుమారు 360 బస్తాలు ఉంటాయి.