ఎలక్షన్​ డ్యూటీలో ఆఫీసర్లు .. బార్డర్​ దాటుతున్న సీఎంఆర్​ వడ్లు

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లాలోని రైస్​ మిల్లర్లు సీఎంఆర్​ వడ్లను పైసా పెట్టుబడి లేకుండా బార్డర్​ దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని ఆఫీసర్లంతా ఎలక్షన్​ డ్యూటీలో బిజీగా ఉండగా, మిల్లర్లు మాత్రం తమ పని కానిచ్చేస్తున్నారు. గత వానాకాలం, యాసంగి సీజన్లలో వడ్లను ప్రభుత్వం సేకరించి 158 రైస్ మిల్లులకు సీఎమ్మార్​ కోసం కేటాయించింది. 2022–-23 వానాకాలంలో 2,56,243 మెట్రిక్  టన్నుల వడ్లను మిల్లర్లకు కేటాయించారు. 1,71,682 మెట్రిక్  టన్నుల బియ్యం ఎఫ్ సీఐకి ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 36,090 మెట్రిక్  టన్నుల బియ్యం మాత్రమే మిల్లర్లు ఇచ్చారు. ఇక 56 రైస్ మిల్లర్లు ఒక్క బియ్యం గింజ కూడా ఇవ్వలేదు.

దీనిపై ఇటీవల వనపర్తి కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లతో మీటింగ్​ ఏర్పాటు చేసి వారం రోజుల్లో బియ్యం ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ మిల్లుర్లు వడ్లను పక్క రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తున్నారు. నాలుగు రోజుల కింద పెబ్బేరు పట్టణంలో పోలీసుల తనిఖీల్లో వెయ్యి సంచులకు పైగా సీఎంఆర్  వడ్లు పట్టుబడ్డాయి. రెండు లారీలను  సీజ్  చేసి వనపర్తికి చెందిన ఓ మిల్లర్ పై కేసు నమోదు చేశారు. కర్నాటకకు ఈ వడ్లను తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. రెండేండ్లుగా ఈ దందా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

సీఎంఆర్  కేటాయింపుల్లోనూ అక్రమాలు..

జిల్లాలోని 158 రైస్  మిల్లులకు సీఎంఆర్  వడ్లు కేటాయించేందుకు అనుమతిచ్చారు. ఇందులో 145 సాధారణ మిల్లులు కాగా, 13 బాయిల్ రైస్​ మిల్లులు ఉన్నాయి. 2021–-22 సీజన్ లో 2,44,569 మెట్రిక్  టన్నుల వడ్లు కేటాయించారు. ఎఫ్ సీఐకి 1,63,861 మెట్రిక్  టన్నుల సీఎంఆర్​ బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉండగా, 1,56,841 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. 2021–-22 యాసంగిలోనూ 198.048 మెట్రిక్ టన్నులు తిరిగి ఇవ్వాల్సి ఉంది.

అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే సీఎంఆర్​తో సంబంధం లేకుండా వడ్లను కేటాయించడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో జిల్లాలో పని చేసిన ఓ ఆఫీసర్​ సీఎంఆర్  వడ్ల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో తన బంధువులతో రైస్  మిల్లు కట్టించి వడ్లు కేటాయించి, అక్రమ దందాకు తెర లేపారు. దీంతో ఆయనను బదిలీ చేశారు. అయినప్పటికీ అక్రమాలు అలాగే కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి.

ALSO READ : పెద్దోళ్లను వదిలి.. చిన్నోళ్లపై వేటు .. సాంస్కృతిక సారథి కళాకారులపై చర్యలు

పీడీ యాక్ట్  నమోదు చేస్తాం..

ప్రస్తుతం వానాకాలం సీజన్ లో కొత్త వడ్లు కొంటున్నాం. గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్​ బియ్యం వెంటనే ఇవ్వాలని మిల్లర్లకు సూచించాం. కొందరు మిల్లర్లు సీఎంఆర్​ వడ్లను అక్రమంగా తరలిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్న వారిపై పీడీ యాక్ట్  నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని రైస్  మిల్లుల్లో స్టాక్ చెక్ చేస్తాం.

కొండల్ రావు, డీఎస్ వో, వనపర్తి