సీఎంఆర్​ క్లియర్​ కాలే

సీఎంఆర్​  క్లియర్​ కాలే
  • గడువు దాటినా బియ్యం ఇవ్వని రైస్​మిల్లర్లు
  • రూ.150కోట్ల విలువ గల బియ్యం పెండింగ్​

వనపర్తి, వెలుగు : జిల్లాకు చెందిన రైస్​మిల్లర్లు సీఎం ఆర్​ అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. సీఎంఆర్​ అప్పగించడానికి అధికారులు ఇచ్చిన ఆఖరి గడువు ముగిసి వారం రోజులైనా ఇంకా చాలా మిల్లుల యజమానులు బియాన్ని ఎఫ్ సీఐకి అందించలేదు. గత నాలుగేళ్లుగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం రైస్​మిల్లర్లకు కేటాయిస్తోంది.

 మిల్లింగ్​ చేసి క్వింటాలు వడ్లకు నుంచి 67కిలోల బియ్యాన్ని సీఎంఆర్​ కింద ఇవ్వాలి. కాని, ప్రభుత్వం కేటాయించిన వడ్లను చాలా మంది మిల్లర్లు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుని సీఎంఆర్​అప్పగించకుండా కాలం గడిపేస్తున్నారు. 

కొంతమంది పీడీఎస్​ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసి సీఎంఆర్​కింద అప్పగించినట్టు ఆరోపణలున్నాయి. ఇంకా పెండింగ్​లో ఉన్న రైస్​ కోసం మిల్లులను తనిఖీ చేసిన అధికారులు ఎక్కడా ధాన్యం నిల్వ లేకపోవడాన్ని గమనించి తెల్లబోయారు. ధాన్యాన్ని దారి మళ్లించిన పలు మిల్లులను సీజ్​ చేయగా, పలువురిపై క్రిమినల్​ కేసులు కూడా నమోదు చేశారు. 

 కోట్ల విలువైన రైస్​ పెండిం గ్​

జిల్లాలో 2019–-20 నుంచి 2022–-23 సీజన్ల వరకు రైస్​మిల్లుల నుంచి రూ.556 కోట్ల విలువ గల 2.25 లక్షల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ అందవలసి ఉండగా సెప్టెంబరు 20వరకు కేవలం రూ.400కోట్ల విలువైన సీఎంఆర్​మాత్రమే రికవరీ చేసినట్లు సివిల్​ సప్లయి ఆఫీసర్లు చెప్తున్నారు. ఇంకా రూ.156 కోట్ల రైస్​ పెండింగులో ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. 

 పది మిల్లులపై క్రిమినల్​ కేసులు

జిల్లాలోని మిల్లుల మీద జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దాడులు చేశారు. ఇందులో భాగంగా ఏడు రైసు మిల్లులపై క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. ఈ రైస్​మిల్లుల నుంచి రావాల్సిన సీఎంఆర్​ బియ్యం విలువ రూ.100కోట్ల వరకు ఉంటుంది. 2023-– 24 ఖరీఫ్​ సీజనుకు సంబంధించి మూడు రైస్​మిల్లుల్లో ధాన్యం లేదని తేలడంతో వాటిపైనా క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. 

ఈ మూడింటిలో ఒక్కో మిల్లులో రూ.8 కోట్ల ధాన్యం మాయం అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు. సీఎంఆర్​ ఇవ్వకుండా ధాన్యాన్ని మాయం చేసిన 40 మిల్లుల యజమానుల మీద ఆర్​ ఆర్​ యాక్టు కింద కేసులు పెట్టి.. ఆస్తులు జప్తు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఫారమ్​-3 ప్రకారం అయిదు రైస్​మిల్లుల యాజమాన్యాలకు సంబంధించి ఆస్తుల జప్తు చేశారు. దాదాపు రూ.కోటి విలువైన ఆస్తులు సీజ్​ చేసిన అధికారులు వాటి యాజమాన్య హక్కులు మార్పిడి జరగకుండా చూడాలని సబ్​రిజిస్ర్టార్​కు సూచించారు.