సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ ఇవ్వకుండా ఇద్దరు మిల్లర్లు చేతులెత్తేయడం, మరికొన్ని మిల్లులపై ఆఫీసర్లు చర్యలు తీసుకోవడంతో మిగతా వారు అలర్ట్ అయ్యారు. సీఎంఆర్ ఇవ్వడంలో లేట్‌చేసినందున ఈ సీజన్లో ఆఫీసర్లు వడ్లు కేటాయించకపోవడం, తమ మిల్లుల్లో స్టాక్ లేకపోవడంతో మిల్లర్లు వడ్ల కోసం ‘పైలెవల్’ పైరవీలు ప్రారంభించారు. తమ మిల్లుల్లో వడ్ల నిల్వలు లేవన్న విషయం బయటకు పొక్కకముందే ఆ లోటును ఎలాగైనా పూడ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పైరవీల వ్యవహారం ప్రస్తుతం కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుందని సమాచారం.
37 మిల్లులకే వడ్లు
జిల్లాలో గత మూడు సీజన్లలో 72 మిల్లులకు వడ్లు కేటాయించారు. అయితే 2020–-21 యాసంగి, 2021 – 22 వానాకాలంలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు ఈ సీజన్‌లో వడ్లు కేటాయించొద్దని కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్ నిర్ణయించి, ఇందుకు సంబంధించిన రిపోర్టును కమిషనర్ ఆఫీస్‌కు పంపించారు. దీంతో ఈ సీజన్‌లో 24 మిల్లులకే వడ్లు కేటాయించారు. తర్వాత స్థానిక నేతల ఒత్తిడి, రాజకీయ కారణాలతో మరో 13 మిల్లులకు వడ్లు పంపించారు.
కమిషనర్ లెవల్‌లో పైరవీలు
ఈ సీజన్‌లో తమకు కూడా వడ్లు కేటాయించాలని మిల్లుల ఓనర్లు కమిషనర్ లెవల్‌లో పైరవీలు ప్రారంభించారు. దీంతో మిల్లుల్లో సీఎంఆర్ నిల్వలపై మరోసారి ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇవ్వాలని కమిషనర్ ఆఫీస్ నుంచి సివిల్ సప్లై ఆఫీసర్లకు ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ సారి కలెక్టర్‌తో సంబంధం లేకుండా సివిల్ సప్లై ఆఫీసర్లే మిల్లర్లకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా మిల్లులకు వడ్లు కేటాయించాలంటూ ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు రానున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే జిల్లా ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టులో గతంలో కేసులు నమోదైన ఆరు మిల్లులతో పాటు, దొంగ ట్రక్ షీట్లతో అక్రమాలకు పాల్పడ్డ మిల్లులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మిల్లులకు వడ్లు కేటాయించడంలో భారీ మొత్తం చేతులు మారినట్లు తెలుస్తోంది.
భారీగా కొనుగోళ్లు చేస్తున్న మిర్యాలగూడ మిల్లర్లు
మిర్యాలగూడ, వెలుగు : పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను భర్తీ చేసేందుకు నల్గొండ జిల్లాకు చెందిన మిల్లర్లు మరో ప్లాన్ అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా పీడీఎస్ బియ్యాన్ని సేకరించడంతో పాటు క్వాలిటీ లేని వడ్లను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసి సీఎంఆర్‌గా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న వడ్లను సైతం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2.28 లక్షల టన్నుల వడ్లను మిల్లర్లే కొన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేయగా సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. మొత్తం 285 సెంటర్ల ద్వారా 49,356 మంది రైతుల నుంచి 3.11 లక్షల టన్నుల వడ్లు కొన్నారు.
సెంటర్లకు మరో 1.50 లక్షల టన్నుల వడ్లు రానున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 2.28 లక్షల టన్నుల దొడ్డు వడ్లు మిల్లులకే మళ్లినట్లు సివిల్ సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు. నల్గొండకు సరిహద్దులో సుమారు లక్ష టన్నుల దొడ్డు వడ్లను మిల్లర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.
రిపోర్ట్ పంపించాం
ఆఫీసర్ల సూచన మేరకు రిపోర్టును పంపించాం. కేసులు ఉన్న మిల్లులకు వడ్లు కేటాయించలేదు. పై నుంచి ఆదేశాలు వచ్చిన మిల్లులకే వడ్లు కేటాయిస్తాం
- పుల్లయ్య, సివిల్ సప్లై ఆఫీసర్, సూర్యాపేట