- రైస్ మిల్లుల నుంచి భారీగా వెలువడుతున్న పొగ, బూడిద
- రైస్ ఇండస్ట్రీని తరలించాలని ప్రజల డిమాండ్
- పట్టించుకోని ఆఫీసర్లు
మిర్యాలగూడ, వెలుగు : మిల్లర్ల నిర్లక్ష్యం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ల పట్టింపులేనితనం కారణంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్ల వ్యాపారంతో కోట్లు కూడబెట్టుకుంటున్న మిల్లర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూల్స్ మాత్రం పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లుల నుంచి బయటకు వచ్చే బూడిద, డస్ట్ కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మిర్యాలగూడలోని గాంధీనగర్, రాంనగర్, బాపూజీనగర్, రవీందర్‌నగర్, ప్రకాశ్‌నగర్, యాద్గార్‌పల్లి, బాదలాపురం, హనుమాన్‌పేటలో సాగర్ మెయిన్ రోడ్డు వెంట ఉన్న మిల్లులు పొల్యూషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.
రాజకీయ పలుకుబడితో కదలని రైస్ ఇండస్ట్రీ
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో సుమారు లక్షన్నర జనాభా ఉంటుంది. ఈ ఏరియాలో 74కు పైగా రైస్‌మిల్లులు ఉన్నాయి. పట్టణం అభివృద్ధి చెందుతుండడంతో రైస్ ఇండస్ట్రీని మరో ప్రాంతానికి తరలించాలని ప్రజలు కొన్నేళ్లుగా కోరుతున్నారు. అయితే రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతోనే మిల్లుల తరలింపును ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు నిత్యం బూడిద, బాయిల్డ్ రైస్ స్మెల్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. మిల్లుల నుంచి వెలువడే పొల్యూషన్ కారణంగా టీబీ, ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి రైస్ ఇండస్ట్రీని తరలించాలని కోరుతున్నారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో రెసిడెన్షియల్ 19,672, నాన్ రెసిడెన్షియల్ 2012, మల్టీ జోన్లలో 513 కలిపి మొత్తం 23,042 ఇండ్లు ఉన్నాయి. ఇందులో మిల్లుల సమీపంలోనే 30 శాతం ఇండ్ల నిర్మాణం జరిగింది. కాగా మున్సిపల్ ఆఫీసర్లు సాగర్ రోడ్డుపై ఫ్లై ఓవర్ వరకు రెసిడెన్షియల్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా ప్రకాశ్‌నగర్ ఇండస్ట్రియల్ జోన్‌ను రెసిడెన్షియల్‌గా, చింతపల్లి, రవీందర్‌నగర్, ఏడుకోట్ల తండా, చింతపల్లి అర్బన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపించారు. ఈ జోన్ల ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పరిస్థితి మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బూడిదతో ఇబ్బందులు పడుతున్నం
మా ఇంటి పక్కనే మిల్లు ఉండడంతో ఆహారం, దుస్తులు, వాహనాలపై బూడిద పడుతోంది. 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మిల్లులను వేరే చోటికి తరలిస్తామని కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ పట్టించుకోవడం లేదు. మిల్లుల తరలింపుపై ఇటీవల మీటింగ్ నిర్వహించినా ప్రయోజనం కనిపించడం లేదు.
– కాటుక రమేశ్ హనుమాన్‌పేట