ఈ చెంబును చూపించి రూ. 10 లక్షలు కొట్టేశారు

ఈ చెంబును చూపించి రూ. 10 లక్షలు కొట్టేశారు

రాగి  పాత్రలతో అద్భుతాలు సృష్టిస్తానని....తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించొచ్చని  నమ్మబలుకుతూ మోసగిస్తున్న పలువురిని సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ పేరుతో మాయమాటలు చెప్తూ.. నిండా ముంచుతున్న ఐదుగురు  మాయగాళ్లను చేర్యాలలో అదుపులోకి తీసుకున్నారు. 

సిద్దిపేట జిల్లా చేర్యాలలో రైస్ పుల్లింగ్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి  పురావస్తు చెంబుతో పాటు రూ. 10.75 లక్షల నగదు, 5సెల్ ఫోన్లు,ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అసలు రైస్‌ పుల్లింగ్‌ అంటే ఏంటీ 

రైస్‌ అంటే బియ్యం, పుల్లింగ్‌ అంటే లాక్కోవడం అని అర్థం. ఒక వస్తువుకు కొన్ని  గంటలపాటు  అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది.  రైస్‌ పుల్లింగ్‌లో దీన్ని అద్భుత శక్తిగా కేటుగాళ్లు నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్‌ పుల్లింగ్‌ ముఠా తమ మోసాలకు వాడుకుంటారు. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో అమాయకుల నుంచి లక్షలు కాజేస్తున్నారు.

నిజంగా అతీత శక్తులు ఉంటాయా..?

బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్‌ పుల్లర్‌గా భావిస్తారు. ఇరీడియం లోహాన్ని కలిగి ఉండే వీటిని చూపించి  రైస్ పుల్లింగ్ బ్యాచ్ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి అతీత శక్తుల పేరుతో వీటిని అమ్మడం నేరం. కానీ కొందరు పనికిమాలిన వాళ్లు సులభంగా  డబ్బులు సంపాదించేందుకు ముఠాలుగా ఏర్పడి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రేడియేషన్‌ ఆర్టికల్‌ అమ్మకాలతో మోసాలు చేస్తున్నారు. ఈ పాత్రలకు అతీతశక్తులు,  దివ్య శక్తులు ఉంటాయని.. ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మిస్తారు. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, చెంబులు, మూతలు, విగ్రహాలు, నగలు, పాతకాలం నాణేలు లాంటివి రైస్‌ పుల్లర్‌ పరికరాలుగా ఉపయోగిస్తారు. నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద లాంటి మొక్కల్లో కూడా రైస్‌ పుల్లర్‌ లక్షణాలున్నాయని నమ్మబలుకుతారు.