బయటపడుతున్న బియ్యం దొంగలు

బయటపడుతున్న బియ్యం దొంగలు
  • ఎన్​ఫోర్స్​మెంట్ తనిఖీల్లో ఒక్కో తిమింగలం బయటకు
  • మొన్న సూర్యాపేటలో సోమ నర్సయ్య, తాజాగా కరీంనగర్​లో మారుతి  
  • రూ.130 కోట్ల మేర బియ్యం పక్కదారి.. ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు 
  • కరీంనగర్​ జిల్లాలోని ఏ మిల్లులో చూసినా కోట్లలో తేడాలు
  • గత బీఆర్ఎస్​ పాలనలో సహకరించిన సివిల్ సప్లై ఆఫీసర్లు 
  • కొత్త ప్రభుత్వం వచ్చాక అక్రమార్కులపై కేసులు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో బియ్యం దొంగలు బయటపడుతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా కొన్నాళ్లుగా రైస్ మిల్లులపై నిర్వహిస్తున్న దాడులతో మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రూ.2 కోట్లు, రూ.5 కోట్లు, రూ.10 కోట్ల మేర విలువైన బియ్యాన్ని అమ్ముకున్న అవినీతి సొరచేపలతోపాటు రూ. వంద కోట్లకుపైగా బియ్యం బుక్కిన భారీ తిమింగలాలు కూడా బయటకొస్తున్నాయి.

నెల క్రితం సూర్యాపేటలో ఇమ్మడి సోమనర్సయ్య, సోమయ్య బ్రదర్స్ చేసిన రూ.100 కోట్ల స్కామ్ బయటికి రాగా... తాజాగా కరీంనగర్ లో రూ.130 కోట్ల మేర బియ్యాన్ని పక్కదారి పట్టించిన బండారి మారుతి, శారద దంపతుల అవినీతి వ్యవహారం బయటపడింది. రెండేండ్ల క్రితం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వకపోయినా ఆ తర్వాత ఏడాది కూడా అవే మిల్లులకు మళ్లీ కోట్లాది రూపాయల విలువైన ధాన్యం అప్పగించడంతో ఆయా జిల్లాల సివిల్ సప్లై ఆఫీసర్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్ ఆదేశాలతో ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. ఇంత పెద్ద మొత్తంలో రికవరీ చేయడం మాత్రం సవాల్​గా మారింది. 

బియ్యం ఎలా అమ్ముకున్నరు?

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.వంద కోట్లకుపైగా విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్లు బయటి మార్కెట్ లో ఎలా అమ్ముకున్నారనేది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. లారీల్లో ఎలా తరలించారు ? చెక్ పోస్టులు దాటుకుని ఆంధ్రపదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దులు ఎలా దాటించారు? దీనికి ఆఫీసర్లు ఎవరెవరు సహకరించారు ? అనేది తేలాల్సి ఉంది. ఎఫ్ సీఐకి లెవీ పెట్టకుండా బయట బహిరంగ మార్కెట్ లో క్వింటాల్​కు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు అమ్ముకున్నట్టు తెలిసింది. 

పెట్టుబడి లేని వ్యాపారం 

పైసా పెట్టుబడి లేకుండా కోట్లు గడించడానికి సీఎంఆర్ బిజినెస్ కొందరు అక్రమార్కులకు షార్ట్ కట్ రూట్ గా మారింది. రైస్ మిల్లులను లీజుకు తీసుకోవడం, అధికారులకు మామూళ్లు ఇచ్చి వడ్లను కేటాయించేలా చేసుకోవడం, ఆ తర్వాత బియ్యంగా మార్చి బయట మార్కెట్ లో అమ్ముకుని రూ.కోట్లు గడించడం, కేసులు పెడితే కోర్టును ఆశ్రయిస్తూ కాలయాపన చేయడం కొందరికి అలవాటుగా మారింది. చాలా మంది ఒక ఏడాది ఇవ్వాల్సిన బియ్యంలో సగం బయట అమ్మేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. మిగతా సగాన్ని  మరో ఏడాదిలో అప్పగించిన ధాన్యంలో మరాడించి ఇస్తున్నారు. ఇలా ఎప్పుడూ కొంత పెండింగ్ పెడుతూ సర్కార్ ఇచ్చిన ధాన్యంతోనే చాలా మంది బియ్యం దందా నడుపుతున్నారు. 

ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు 

సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్న మిల్లర్లు.. ఆ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మిల్లర్ సర్కార్ కు కోట్లాది రూపాయలు ఎగనామం పెట్టి ఇటీవల ఏకంగా మూడెకరాల విస్తీర్ణంలో మిల్క్ డెయిరీ ప్లాంట్ ను ప్రారంభించారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డెయిరీ ప్రారంభోత్సవానికి సీఎం సోదరుడినే ఆహ్వానించడం గమనార్హం. కానీ ఆయన రాలేదు. అలాగే, బియ్యం విక్రయించగా వచ్చిన డబ్బులను బినామీల పేరిట రియల్ ఎస్టేట్, హోటళ్లు, ఇతర బిజినెస్ లోకి మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల బియ్యం సరిహద్దులు దాటుతున్నా.. జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు మామూళ్ల మత్తులోపడి ఇచ్చిన ధాన్యం మిల్లుల్లో ఉన్నాయో? లేవో ? చూసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కొత్త సర్కార్ వచ్చాక పదుల సంఖ్యలో కేసులు, అరెస్టులు 

గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల అండతో రైస్ మిల్లర్లు రెచ్చిపోయారు. వందల కోట్లు ఎగనామం పెట్టినా అడిగేవారు లేకపోవడంతో అక్రమాలకు పాల్పడ్డారు. తరుగు పేరిట రైతులను దోపిడీ చేయడం, ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి బయట అమ్ముకోవడం, తమను ఎవరూ అడగకుండా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎలక్షన్ సమయంలో ఫండింగ్ చేయడం మిల్లర్లకు సాధారణమైపో యింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, పోలీస్, రెవెన్యూ శాఖను రంగంలోకి దింపింది. దీంతో అనేక మంది మిల్లర్ల అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో వారిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు.

ఇప్పటివరకూ నమోదు చేసిన కేసులివే..

    సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యకు తిరుమలగిరి, నాగారం మండలాల్లో ఉన్న రెండు రైస్ మిల్లులపై దాడి చేయగా రూ.వంద కోట్ల  విలువైన ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. దీంతో మే నెలలో క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. 

    కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి శివారులోని మహాశక్తి రైస్ మిల్లు, ఇల్లందకుంట మండలంలోని సీతారామ ఇండస్ట్రీస్ లో ఇటీవల సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. 2022 నుంచి ఇప్పటి వరకు అప్పగించిన సుమారు 130 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లినట్టు గుర్తించారు. ఈ రెండు మిల్లులు కరీంనగర్ కు చెందిన బండారి మారుతి, -శారద దంపతుల పేరిట నడుస్తున్నాయి. దీంతో వీరిద్దరిపై సివిల్ సప్లై ఆఫీసర్లు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 

    జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లుపై సోమవారం దాడులు నిర్వహించగా.. 10,756 క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు

   మంచిర్యాల జిల్లా ఇందారంలోని శివసాయి మల్లికార్జున ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 592.121 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల ధాన్యం మాయమైంది. దీంతో యజమానిపైనే క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు నమోదు చేశారు.

    కోదాడ రూరల్ ప్రాంతమైన కొమరబండ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో అధికారులు తనిఖీలు చేయగా.. రూ.64 కోట్ల విలువైన బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలినట్టు గుర్తించారు. దీంతో మిల్లు ఓనర్ నీల సత్యనారాయణతోపాటు ఇతరులపై నాన్ బెయిలెబుల్ సెక్షన్ల కింద కేసులు బుక్​ చేశారు.

    నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ లోని సాయికృష్ణ రైస్ మిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వానికి అందజేయాల్సిన 1.8 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు గుర్తించారు. మిల్లు ఓనర్ రాజేందర్ రెడ్డిపై కేసు నమోదు చేయించారు.