ఫిలిప్పీన్స్​కు యాదాద్రి బియ్యం..నాలుగు మిల్లుల నుంచి 10 వేల టన్నులు

ఫిలిప్పీన్స్​కు యాదాద్రి బియ్యం..నాలుగు మిల్లుల నుంచి 10 వేల టన్నులు
  • 5 శాతం నూకతో సరఫరా
  • మిల్లర్లకు క్వింటాల్​కు రూ. 350  చెల్లింపు
  • మిల్లు నుంచి కాకినాడ ఫోర్ట్​ వరకూ ట్రాన్స్​పోర్ట్

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా నుంచి ఫిలిప్సీన్స్​ దేశానికి బియ్యం ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు బియ్యం పంపించడానికి జిల్లాలోని నాలుగు మిల్లులు అంగీకరించాయి. మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్​ వరకూ బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్సీన్స్​కు తరలిస్తారు.బియ్యం కోసం గతేడాది ఫిలిప్సీన్స్​ దేశం.. సర్కారును సంప్రదించింది. దీంతో ఆ దేశంతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి అప్పట్లోనే చర్చించారు. బియ్యంలో నూక 5 శాతానికి మించకుండా ఎగుమతి చేయాలని ఆ దేశం కోరడంతో రాష్ట్రం నుంచి లక్ష టన్నుల బియ్యం ఎగుమతికి ప్రభుత్వం ఓకే చెప్పింది.

మిల్లర్లతో పౌరసరఫరా శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహన్​ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిప్సీన్స్​కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో మిల్లర్లతో చర్చలు జరిపారు. 2022-23 యాసంగి సీజన్​కు సంబంధించిన వడ్లను గతంలోనే టెండర్​ వేసిస సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఆ సీజన్​ వడ్లను ఇంకా పూర్తి స్థాయిలో మిల్లర్లు ఇవ్వలేదు. దీంతో ఆ సీజన్​కు చెందిన వడ్లను మరాడించి బియ్యం ఇవ్వాలని సూచించారు. దీనికి పలు మిల్లులు అంగీకరించాయి. 

మిల్లుల నుంచి కాకినాడ పోర్టు వరకూ

జిల్లాలోని కాదంబరీ, యాదాద్రి, మల్లికార్జున, విద్య మిల్లుల్లోని బియ్యాన్ని లారీల ద్వారా కాకినాడ పోర్టు వరకూ తరలిస్తారు. ఈ ట్రాన్స్​పోర్ట్​ చార్జీలను సైతం ప్రభుత్వమే భరించనుంది. అక్కడి నుంచి ఓడల ద్వారా ఫిలిప్సీన్స్​కు  పంపిస్తారు. 

యాదాద్రి నుంచి 10 వేల టన్నులు

ఫిలిప్సీన్స్​కు బియ్యం పంపించడానికి జిల్లాలోని కాదంబరీ, యాదాద్రి, మల్లికార్జున, విద్య మిల్లులు అంగీకరించాయి. ఈ మిల్లుల్లో 2022-23 సీజన్​కు సంబంధించిన​ వడ్లను మరాడించి 10 వేల టన్నులను ఫిలిప్సీన్స్​కు పంపించడానికి ఓకే చెప్పాయి. అయితే సీఎంఆర్​కు 25 శాతం నూకను ప్రభుత్వం అంగీకరించేది.. ఇప్పుడు 5 శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది. అందుకే క్వింటాల్​కు రూ. 350 మిల్లర్లకు ఇవ్వనున్నారు.

దీంతో పాటు క్వింటాల్​కు రూ. 50 చొప్పున మిల్లింగ్​ చార్జీలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. బియ్యం ప్యాక్​ చేయడానికి తెల్ల గన్నీ బ్యాగులను సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ మిల్లర్లకు అందించనుంది. అయితే బియ్యం నాణ్యతతో పాటు నూక శాతాన్ని సివిల్​ సప్లయ్ డిపార్ట్​మెంట్​​ టీమ్​ పరిశీలించిన తర్వాతే ప్యాక్​ చేస్తారు.