న్యూఢిల్లీ: మనదేశం చాలా రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ, వ్యాపారం చేసేందుకు రూల్స్‌ను సరళీకరిస్తున్నప్పటికీ హెచ్ఎన్డబ్ల్యూఐలు విదేశాలకు వెళ్లడం ఆగడం లేదు. మన దేశం నుంచి ఈ సంవత్సరంలో 6,500 మంది హైనెట్వర్త్ ఇండివిడువల్స్ (హెచ్ఎన్డబ్ల్యూఐలు) విదేశాలకు వలస వెళ్తారని ఇటీవల ఒక స్టడీ వెల్లడించింది. ఇది చాలా పెద్ద సంఖ్య! మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారిని హెచ్ఎన్డబ్ల్యూఐలు అంటారు. వీళ్లు వలస వెళ్లడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రస్తుత ఏడాది చైనా నుంచి దాదాపు 13,500 మంది సంపన్నులు విదేశాలకు వెళ్తారని అంచనా. తర్వాత స్థానం ఇండియాదే అవుతుంది.
దాదాపు 6,500 మంది మిలియనీర్లు ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారని అంచనా. గత సంవత్సరం భారతదేశం 7,500 హెచ్‌ఎన్‌డబ్ల్యుఐలను కోల్పోయింది. చైనా నుంచి 10,800 మంది, రష్యా నుంచి 8,500 మంది వెళ్లిపోయారు. 2013–2022 మధ్య భారతదేశం 48,500 హెచ్ఎన్డబ్ల్యూఐలను కోల్పోయిందని హెన్లీ పార్ట్నర్స్ డేటా చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం... వలసల వల్ల కోల్పోయిన దానికంటే చాలా ఎక్కువ మంది కొత్త మిలియనీర్‌లను భారతదేశం తయారు చేస్తోంది. కాబట్టి వీటి గురించి ఆందోళన అనవసరం. తాజా లెక్కల ప్రకారం ఇండియా మొత్తం మిలియనీర్ల సంఖ్య 344,600 ఉండగా, వీరిలో కేవలం 1.9శాతం మంది విదేశీ బాట పట్టే అవకాశం ఉంది. ఈ సంఖ్య కూడా గత సంవత్సరంతో పోలిస్తే తక్కువ.
ఇవీ కారణాలు..
మనదేశ పన్ను విధానాలు నచ్చకపోవడం, విదేశాల నుంచి డబ్బు పంపడం (అవుట్‌బౌండ్ రెమిటెన్స్‌లు) కష్టం కావడంతో కొందరు సంపన్నులు విదేశాలవైపు చూస్తున్నారు. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ రూ.5 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారికి సర్‌చార్జిని తగ్గించింది. కొత్త పన్ను విధానంలో అత్యధిక పన్ను రేటును 42.7శాతం నుండి 39శాతానికి తగ్గించింది. ఇవి హెచ్ఎన్డబ్ల్యూఐలకు ఉపశమనమే అయినా, ఇతర ఆందోళనలూ ఉన్నాయి. ఉదాహరణకు విద్య, వైద్య బిల్లులు మినహా రూ. 7 లక్షల కంటే ఎక్కువ ఫారిన్ రెమిటెన్స్‌లపై పన్నును ఇటీవల 5శాతం నుండి 20శాతం వరకు పెంచారు. పిల్లల విద్య, సామాజిక భద్రత, జీవనశైలి వంటివి ఇండియా కంటే ధనిక దేశాల్లో బాగుండటం మరో కారణం. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా కేవలం ధనవంతులకే కాకుండా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన భారతీయులకు కూడా నచ్చుతోంది. ఈ దేశాల్లో ఉన్నత విద్యకు, కెరీర్‌కు మంచి అవకాశాలు ఉంటాయి. పెద్ద మార్కెట్లు, బలమైన బ్యాంకింగ్ వ్యవస్థల కోసం దుబాయ్, సింగపూర్‌లలో టెక్ కంపెనీలు, సంపన్న భారతీయ కుటుంబాలు ఆఫీసులను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ధనవంతులకు వలస వెళ్లడం ఈజీయే
తమ దగ్గర పెట్టుబడి పెట్టేవారికి లేదా వ్యాపారాలను ఏర్పాటు చేసేవారికి ధనిక దేశాలు సులభంగా వీసాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు.. యూఎస్ఈబీ–-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్. ఎవరైనా 8,00,000 డాలర్లు ఆ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే గ్రీన్ కార్డ్ పొందవచ్చు. యూఏఈ గోల్డెన్ వీసాకు కనీసం 5,50,000 డాలర్లు పెట్టుబడి పెట్టాలి. దీంతో 10 సంవత్సరాల వరకు రెన్యువబుల్ రెసిడెన్స్ వీసా వస్తుంది. భారతీయ మిలియనీర్లు పోర్చుగల్, గ్రీస్, మొనాకో వంటి ట్యాక్స్ హెవెన్స్కు కూడా వెళ్తున్నారు. ఈ దేశాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఫారిన్ రెమిటెన్స్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్ రూల్స్‌ను, టెక్ ట్రాన్స్ఫర్లను సరళీకరించడం ద్వారా ఇలాంటి వలసలను తగ్గించవచ్చని ఎక్స్పర్టులు అంటున్నారు. చాలా మంది ఇండియన్లు కొన్నేళ్లు విదేశాల్లో ఉన్నాక తిరిగి సొంతదేశానికి రావాలని కోరుకుంటారు. ఇలాంటి వారికి డ్యూయల్ సిటిజన్‌షిప్ ఇవ్వాలని సూచిస్తున్నారు.