- అన్ని రాజకీయ పార్టీల వారుఆక్రమణలకు పాల్పడుతున్నరు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్థలాల కబ్జాల్లో పేదవారి కంటే సంపన్నులే ఎక్కువగా కనిపిస్తున్నారని, అలాగే అన్ని రాజకీయ పార్టీల వారు ఆక్రమణల్లో ఉన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్‌లో ఏకంగా ఎకరం స్థలం కబ్జా చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా, హైడ్రా అడ్డుకుందన్నారు.
నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో అర్బన్ బయోడైవర్సిటీ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో శనివారం ఆయన మాట్లాడారు. సిటీలో చెరువులు 61 శాతం కబ్జాకు గురయ్యాయని, పటిష్ట చర్యలు చేపట్టకపోతే ఉన్న 39 శాతం చెరువులు కూడా వచ్చే 15 ఏండ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు.
త్వరలో హైడ్రా పోలీసు స్టేషన్
చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాలు ఆక్రమణల పాలవ్వకుండా అనేక చట్టాలున్నాయని, అవన్నీ కచ్చితంగా అమలయ్యేలా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో హైడ్రా పోలీసు స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పార్కులకోసం కేటాయించిన స్థలాలు, రహదారులు ఇలా అన్ని విషయాలపై పూర్తి సమాచారంతో డేటా తయారు చేస్తున్నామన్నారు.
నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చైర్మన్ అచలేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జీవవైవిద్యానికి ఊతమిచ్చే చెరువుల పరిరక్షణలో హైడ్రాకు తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. దేశంలోని ప్రతి నగరంలో హైడ్రా లాంటి వ్యవస్థ ఉండేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు.