వరుసగా 28 మ్యాచ్‌ల్లో వికెట్.. సంచలనంగా మారిన పసికూన బౌలర్

వరుసగా 28 మ్యాచ్‌ల్లో వికెట్.. సంచలనంగా మారిన పసికూన బౌలర్

మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టే.. క్రికెట్ లో గుర్తించలేని పసికూన బౌలర్లున్నారు. స్టార్ ప్లేయర్లనే గుర్తు పెట్టుకునే క్రికెట్ లవర్స్.. ఎంత బాగా రాణించినా అనామక ఆటగాళ్లను పట్టించుకోరు. చిన్న జట్లే అయినా కొంతమంది ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తారు. వారిలో జింబాబ్వే లెఫ్టర్మ్ సీమర్ రిచర్డ్ నగరవ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ బౌలర్లు సాధించలేని ఫీట్ ను ఈ అనామక బౌలర్ చేసి చూపించాడు. వరుసగా 28 మ్యాచ్ ల్లో కనీసం ఒక వికెట్ తీసుకొని ఔరా అనిపించాడు.   
            
పరిమిత ఓవర్ల క్రికెట్ లో నగరవ ఈ అరుదైన ఘనత సాధించాడు. జింబాబ్వే ఎప్పుడు మ్యాచ్ ఆడినా ఈ పేసర్ నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. వికెట్ తో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక బౌలర్ గా మారాడు. నిన్నటివరకు 27 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించిన ఈ లెఫ్టర్మ్ పేసర్ నిన్న జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. లంక టాపార్డర్, మిడిల్ ఆర్డర్ వికెట్లను పడగొట్టిన ఈ యువ పేసర్ జింబాబ్వే విజయం కోసం శాయశక్తులా పోరాడినా.. శ్రీలంక ఈ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 

మొత్తం 10 ఓవర్లలో 3 మెయిడెన్ ఓవర్లు వేసిన నగరవ కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వన్డేల్లో వికెట్లు తీసుకున్నా.. టీ20ల్లో వికెట్లు తీయడం సామాన్యమైన విషయం కాదు. కానీ నగరవ తన అద్భుత బౌలింగ్ తో టాప్ క్లాస్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ యువ బౌలర్ ఇలాగే కొనసాగితే రషీద్ ఖాన్ లా స్టార్ బౌలర్ అయినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి నగరవ తన వికెట్ల వేటకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.