కోహ్లీ, స్మిత్ కాదు.. సచిన్ ఆల్ టైం రికార్డు అతడే బ్రేక్ చేస్తాడు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్

కోహ్లీ, స్మిత్ కాదు.. సచిన్ ఆల్ టైం రికార్డు అతడే బ్రేక్ చేస్తాడు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్

టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆల్ టైం రికార్డ్ ఒకటి ప్రమాదంలో పడింది. టెస్టు ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డ్ ను ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 12 వేల పరుగుల క్లబ్ లోకి చేరుకున్న రూట్.. మరో నాలుగేళ్లు తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తే సచిన్ రికార్డ్ బ్రేక్ చేసి సరి కొత్త చరిత్ర సృష్టిస్తాడు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్  టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డ్ ను జో రూట్ బద్దలు కొట్టగలడని అభిప్రాయపడ్డాడు.

పాంటింగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. "రూట్ సచిన్ రికార్డ్ బ్రేక్ చేయగలడు. ప్రస్తుతం అతని వయస్సు 33 సంవత్సరాలు. ఇంగ్లాండ్   ఎన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడతారు అనేదానిపై రూట్ రికార్డ్ ఆధారపడి ఉంటుంది. వారు సంవత్సరానికి 10 నుండి 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే.. రూట్ 800 నుండి 1,000 పరుగులు స్కోర్ చేసే అవకాశం ఉంది. మరో మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఆడినా సచిన్ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది". అని ఈ ఆసీస్ క్రికెటర్ జోస్యం ఐసీసీ సమీక్షలో పాంటింగ్ తెలిపాడు. 

పాంటింగ్ 168 టెస్టుల్లో 13,378 పరుగులతో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. రూట్ ప్రస్తుతం 143 టెస్టుల్లో 12,027 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. రూట్ ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో అలెస్టర్ కుక్ (12472) ఉన్నాడు.టెస్ట్ కెరీర్ లో 142 టెస్టుల్లో 259 ఇన్నింగ్స్ లు ఆడిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఖాతాలో 31 సెంచరీలు 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.