ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. టెస్ట్ క్రికెట్ లో అసలైన మజాను చూపిస్తాయి. అగ్ర జట్లు.. స్టార్ ఆటగాళ్లు.. స్టేడియం నిండా ప్రేక్షకులు.. వెరసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి. మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.
ఈ టెస్ట్ సిరీస్ పై ఆసీస్ దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఈ సారి 3-1 తేడాతో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇది ఒక పోటీ సిరీస్ అవుతుందని.. చివరిసారిగా ఆస్ట్రేలియాలో జరిగిన రెండు సిరీస్ లను భారత్ గెలుచుకుందనే విషయం ఆసీస్ కు తెలుసని చెప్పుకొచ్చాడు. ఐదు టెస్టులు జరగడం చాలా ఉత్తేజకరంగా ఉందని.. చాలా మ్యాచ్ లు డ్రా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పాంటింగ్ తెలిపాడు.
1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌గానే నిర్వహించేవారు.సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.
ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
Ricky Ponting predicts 3-1 series victory for Australia against India in Border Gavaskar Trophy. [ICC] pic.twitter.com/Jw5fYN03Rp
— Johns. (@CricCrazyJohns) August 13, 2024