- డ్రెస్సింగ్ రూమ్ విషయాలు తరచూ లీక్
- బీసీసీఐ అంతర్గత చర్చలూ బయటికి
- చాంపియన్స్ ట్రోఫీ ముంగిట అభిమానుల్లో టెన్షన్
రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచి.. టీ20 వరల్డ్ కప్ గెలిచి అభిమానుల చేత జేజేలు కొట్టించుకున్న ఇండియా టీమ్ ఇప్పుడు అనేక వివాదాలు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ద్రవిడ్ వారసుడిగా హెడ్ కోచ్ బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్.. జట్టు గౌరవం పెంచుతాడని అనుకుంటే మరో ‘గ్రెగ్ చాపెల్’లా మారబోతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్‌గా వచ్చిన వెంటనే జట్టులో ఎన్నో ఏండ్లుగా ఉన్న సూపర్ స్టార్ సంస్కృతికి పుల్‌స్టాప్ పెట్టాలని గంభీర్ చేస్తున్న ప్రయత్నాలతో జట్టులో అంతర్గత కలహాలు, గ్రూపులు ఏర్పడ్డాయని, అతనితో సీనియర్లకు పొసగడం లేదని తెలుస్తోంది. బోర్డర్– గావస్కర్ ట్రోఫీలో జట్టు చెత్తాట, ఆఖరి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టు నుంచి తప్పుకోవడం మొదలు.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఎంపిక విషయంలో కోచ్, కెప్టెన్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయన్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. టీమిండియా వచ్చే నెలలో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే ముందు జరుగుతున్న ఈ పరిణామాలు దురదృష్టకరం. ఈ టోర్నీలో జట్టు రాణించకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది.
గౌతీ దూకుడు నచ్చట్లేదా?
గౌతమ్ గంభీర్‌కు సహజంగానే దూకుడెక్కువ. ఆటగాడిగా, వివిధ దశల్లో కెప్టెన్‌గా తను ముక్కుసూటిగా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్న గౌతీ 2012 ఫైనల్లో తమ తుది జట్టు నుంచి బ్రెండన్ మెకల్లమ్‌ను తప్పించాడు. అదే తీరును గౌతీ ఇప్పుడు కోచ్‌గానూ కొనసాగిస్తున్నాడు. అయితే గురువుగా ప్లేయర్లంతా తన మాటే వినాలని గంభీర్ జారీ చేస్తున్న ‘హుకుం’ జట్టులోని పలువురు స్టార్లు, సీనియర్లకు నచ్చడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా జట్టులో ఎన్నో ఏండ్లుగా ఉన్న సూపర్ స్టార్ కల్చర్‌కు పుల్‌స్టాప్ పెట్టాలన్న గౌతీ ప్రయత్నాలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని దెబ్బతీశాయి. దేశానికి ఆడుతున్న ఆటగాళ్లంతా సమానమేనని, అందరూ ఒక్క మాటపై ఉండాలని, ఒక్క తాటిపై నడవాలని హెడ్ కోచ్ కోరుకుంటున్నాడు. కానీ, ఆ మాట తనదే అవ్వాలనుకోవడమే సమస్యగా మారినట్టు తెలుస్తోంది. తుది జట్టు ఎంపికలో కూడా తన మాటే చెల్లుబాటు కావాలని చూస్తున్న గౌతీ తీరు నచ్చకనే అశ్విన్ ఆసీస్ టూర్ మధ్యలో రిటైర్మెంట్ ఇచ్చాడన్న విమర్శలు ఉన్నాయి. ఆపై తుది జట్టు ఎంపిక విషయంలో కోచ్, కెప్టెన్, సీనియర్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ, ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయారంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి మీడియాకు లీకులు వచ్చాయి. తుది జట్టులో చాన్స్ రాని సర్ఫరాజ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్ విషయాలు లీక్ చేస్తున్నాడని గంభీర్ గుర్తించినట్టు వార్తలు వచ్చినా.. ఈ విషయం గురించి ఇతర ఆటగాళ్లు గానీ, బోర్డు గానీ మాట్లాడలేదు.
బీసీసీఐ నుంచీ లీకులు..
ఇండియా క్రికెట్ టీమ్‌లో లీకులు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కాలేదు. బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సమాచారం బహిర్గతం అవుతోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ బాధ్యతలు చేపట్టబోతున్నాడంటూ బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా చెప్పింది. వీటి గురించి స్పందించని బీసీసీఐ గంభీర్ సూచన మేరకు ఆటగాళ్ల క్రమశిక్షణకు సంబంధించి పది పాయింట్ల గైడ్‌లైన్స్ రూపొందించింది. దీన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. బయటకు వచ్చేసింది. శనివారం చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ప్రకటన సందర్భంగా ఈ గైడ్‌లైన్స్ గురించి మీడియా ప్రశ్నిస్తే కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తలో విధంగా స్పందించారు.
ఈ గైడ్‌లైన్స్‌పై ప్లేయర్లు అసహనంగా ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అదే సమయంలో ప్లేయర్లకు మద్దతుగా బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగి గంభీర్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత హెడ్ కోచ్‌గా గంభీర్ పనితీరును బీసీసీఐ విశ్లేషిస్తుందని, మెగా టోర్నీలో ఇండియా బాగా ఆడకపోతే అతని పదవికి ముప్పు ఉందని ఒకరిద్దరు బీసీసీఐ పెద్దలు మీడియాకు చెప్పారు. ఇక, ఆసీస్ టూర్‌లో గంభీర్ పీఏ ఒకరు టీమ్‌కు కేటాయించిన అధికారిక వాహనాలు, హోటళ్లలో దర్శనం ఇచ్చాడంటూ మరో అధికారి బీసీసీఐ బాస్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లు ఇండియా క్రికెట్‌లో అత్యంత వివాదాస్పద కోచ్‌గా పేరొందిన ఆస్ట్రేలియన్ గ్రెగ్ చాపెల్ హయంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. టీమిండియాకు ఇది ఎంత మాత్రం మంచిది కాబోదు.
చాంపియన్స్ ట్రోఫీ ఎంపికలో రోహిత్ x గంభీర్!
గంభీర్ విషయంలో సెలెక్షన్ కమిటీ కూడా అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎంత హెడ్ కోచ్ అయినప్పటికీ టీమ్ ఎంపిక విషయంలో గంభీర్ అతి జోక్యం వద్దని సెలెక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం గంభీర్ వైఖరి మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ తీరును తలపిస్తున్నదని ఓ మాజీ సెలెక్టర్ విమర్శించాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి పలువురు ఆటగాళ్లను గంభీర్ పట్టుబట్టి ఎంపిక చేయగా.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో మాత్రం చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ పైచేయి సాధించారు. హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని, శాంసన్‌ను కీపర్‌గా తీసుకోవాలని గౌతీ ప్రతిపాదిస్తే.. అగార్కర్, రోహిత్ మాత్రం గిల్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి, కీపర్‌గా పంత్‌కు మొగ్గు చూపారు. అయితే, ఈ విషయంలో హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్, కెప్టెన్ మధ్య సాధారణ చర్చే జరిగిందా? నిజంగానే బేదాభిప్రాయాలు వచ్చాయా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా గంభీర్ వచ్చిన తర్వాత వన్డేలు, టెస్టుల్లో టీమిండియా సక్సెస్ రేట్ తగ్గింది. వన్డే సిరీస్‌లో శ్రీలంక చేతిలో, టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయిన జట్టు.. బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తూ చేజార్చుకుంది. అందుకు గంభీర్ ఒక్కడినే నిందించలేం. అదే సమయంలో ఓటమిలో తన బాధ్యత లేదని చెప్పలేం. కానీ, ఇలాంటి సమయంలో ఒకరినొకరు నిందించే ‘బ్లేమ్ గేమ్’ను పక్కనబెట్టి అంతా ఒక్కతాటిపై
నడిస్తే మంచిది. జట్టును విజయపథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన
అవసరం ఉంది.