Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన మిశ్రమ జట్టును సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఈ జట్టులో దారుణంగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్‌లకు చోటు కల్పించిన సెలెక్టర్లు.. అవసరమైన వారిని విస్మరించారు. ఇదే విమర్శలకు తావిస్తోంది.

జట్టు ఎంపిక ఎలా ఉన్నప్పటికీ, కొంత మంది ప్లేయర్స్ ఎంపిక విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌, కెప్టెన్ రోహిత్‌ శర్మ మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్,  రోహిత్ ల మధ్య ఇద్దరి ఎంపికపై విభేదాలు తలెత్తినట్లు పేర్కొంది. హార్దిక్‌ పాండ్యకు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించాలని కోచ్ గంభీర్‌ ప్రతిపాదించగా.. ఆ అభ్యర్థనను అగార్కర్, రోహిత్ ఇద్దరూ తిరస్కరించారని సమాచారం. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ పేరు సూచించారట.

Also Read : జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్‌ని చేయండి

పంత్ జట్టులో ఉండాల్సిందే..

ఇక వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకుందామని గంభీర్ కోరగా.. రోహిత్ అడ్డంగా తలూపాడట. సెలెక్టర్లు సైతం రిషబ్ పంత్‌ పక్షాన ఉండటంతో గంభీర్ మద్దతు పొందలేకపోయాడని జాతీయ మీడియా పేర్కొంది. నిజానికి పంత్ తో పోలిస్తే సంజూ శాంసన్ కే జట్టులో చోటు దక్కాలి. కానీ, అతని చర్యలే జట్టుకు దూరం చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి సిరీస్‌లు లేని సమయంలో ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ చెప్పినా.. శాంసన్ పట్టించుకోలేదు. ఇటీవల ముగిసిన వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీకి డుమ్మా కొట్టాడు. ఇది సెలెక్టర్లకు ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. 

ఇక పంత్ గత రెండేళ్లలో ఒకే ఒక వన్డే ఆడాడు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్.. దాని నుంచి కోలుకోవడానికే ఎడదన్నర పాటు జాతీయ అకాడమీకి పరిమితమయ్యాడు. అనంతరం గాయాల నుంచి కోలుకున్నాక శ్రీలంకతో ఓ వన్డే ఆడాడు. కానీ, అంతకు ముందు పర్ఫార్మెన్స్ పరిగణనలోకి తీసుకొని పంత్‍కు ఓటేశారు..సెలెక్టర్లు.