విద్యా హక్కు చట్టం.. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, సార్వత్రిక విద్యను అందించలేదని లోక్‌సభలో సమర్పించిన గణాంకాల ద్వారా వెల్లడైనది. 2024-–25 మొదటి ఎనిమిది నెలల్లో 1.17 మిలియన్ల మంది పిల్లలు బడులకు వెళ్లడం లేదు. దేశ విద్యా వ్యవస్థలో పిల్లలు చదువులకు దూరంగా ఉండటం ఒక సమస్యగా మిగిలిపోతున్నట్లు వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. జీవనోపాధి కోసం తరచుగా ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తున్నందువలన వారి పిల్లలు చదువులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నందు వలన దాదాపు 60 వేల మంది పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు. ఇది సామాజిక పేదరికాన్ని శాశ్వతపరుస్తున్నది. జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారం 2017-–18లో 12.4% మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారు దక్షిణాది కంటే ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఎక్కువ మంది బాలికలు సంపాదించడానికి లేదా ఇంట్లో సహాయం చేయడానికి మిగిలిపోతున్నారు.
గృహ పని, వ్యవసాయం, తయారీ రంగాల్లో పనిచేస్తూ వచ్చిన సంపాదనతో జీవన యానం సాగిస్తున్నారు. పాఠశాలలు చాలా దూరంలో ఉండటం, పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడంతో ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సున్నితమైన సమస్యను అవగాహన, బోధన ద్వారా పరిష్కారం చేయాలి. బాలికలకు అనువైన మౌలిక సదుపాయాలు, సురక్షితమైన ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఫౌండేషన్ లెర్నింగ్ ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. బాల కార్మికులు లేదా మైనర్ వివాహాలకు వ్యతిరేకంగా, పిల్లలను వారి తల్లిదండ్రులను పాఠశాలలకు పంపేవిధంగా సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించాలి.
- దండంరాజు రాంచందర్ రావు