కొత్త చట్టం: ఆఫీస్ డ్యూటీ తర్వాత బాస్ ఎవరో.. వర్క్‌తో సంబంధం లేదు

కొత్త చట్టం: ఆఫీస్ డ్యూటీ తర్వాత బాస్ ఎవరో.. వర్క్‌తో సంబంధం లేదు

బాసుల ఒత్తిళ్ల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగి పని గంటలు పూర్తయ్యాక బాస్ ఎవరో తెలియనట్టు వ్యవహరించేలా, అతను చెప్పే పనులను తిరస్కరించేలా ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. 'రైట్ టు డిస్‌కనెక్ట్' పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ఫిబ్రవరిలో ఆమోదం పొందగా.. ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. 

వాస్తవానికి ఉద్యోగి పని గంటలు పూర్తై ఇంటికెళ్లినా ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కువగా మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ వంటి ఉద్యోగాల్లో ఈ తరహా కష్టాలు చూస్తుంటాం. బాస్ మాటను కాదనలేక కొన్ని సంధర్భాల్లో భార్యాపిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తుంటారు. అందుకు మనుసు అంగీకరించపోయినా.. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో అన్న భయంలో పరుగులు పెడుతుంటారు. అలాంటి కష్టాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ది ఫెయిర్‌ వర్క్‌ అమెండ్‌మెంట్‌(రైట్‌ టూ డిస్‌కనెక్ట్‌) పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 

ఈ చట్టం అమలులోకి వచ్చాక ఉద్యోగులు తమ పని గంటలు పూర్తయ్యాక తమ యజమానులను, వారి నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాస్‌లను విస్మరించే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. యాజమాన్యాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, సందేశాలను, చెప్పే పనులను తిరస్కరించే ఉద్యోగులకు ఈ చట్టం కొంత మేర రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ చట్టంలో కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. ఉద్యోగుల తిరస్కరణను అసమంజసమైనదనిగా చెప్పేందుకు సదరు ఉద్యోగి జాబ్‌ రోల్‌, బాధ్యతలు, కారణం వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులను చట్టంలో పేర్కొన్నారు.

యాజమాన్య సంఘాల వ్యతిరేకత

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని కంపెనీల యాజమాన్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. హడావుడిగాఈ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తున్నాయి.