విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలె

విద్యాహక్కు చట్టం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. 6 నుంచి 14 ఏండ్ల వయసు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాల్సి ఉన్నా.. గ్రామీణ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో పేర్కొన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం సర్కారు స్కూళ్లను బలోపేతం చేయడంతోపాటు, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలి. 

కేంద్ర ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్స్ 21ఎ, 45, 51(కె) లను చేరుస్తూ దేశంలోని 6 నుంచి14 సంవత్సరాల వయసు గల బాల, బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. ఆర్టికల్ 21ఎ ప్రకారం దేశంలోని 6 నుంచి14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి, ఆర్టికల్ 45 ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాల, బాలికలకు 6 సంవత్సరాల వయసు వరకు ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలి.  ఆర్టికల్ 51(కె) ప్రకారం బాల, బాలికల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి సంతానానికి 6 నుంచి14 ఏండ్ల వరకు విద్యనందించే సదుపాయాలు ఏర్పాటు చేయాలి. 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25% కోటా

కేంద్ర ప్రభుత్వం 2009లో బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో ప్రైవేటు విద్యా సంస్థలు సవాలు చేశాయి. సొసైటీ ఫర్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కల్పించిన 25 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది.  ఇందులో ఆర్టికల్ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్ 21ఎ చెల్లుబాటు అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపించింది. 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(5)ను రాజ్యాంగంలో చేరుస్తూ సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల(ఓబీసీ) వారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం 2008లో అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పులో కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ, ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లపై తేల్చలేదు.

ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు సుప్రీం ఓకే

సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం 2012లో ప్రతిమ ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా  కేసును విచారించి 2014లో తుది తీర్పు వెలువరించింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 21ఎ, 93వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్15(5)లను ఆమోదిస్తూ ప్రభుత్వ,  ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ),  షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల(ఓబీసీ) వారికి రిజర్వేషన్ల కల్పనను ఆమోదించింది. అదే తీర్పులో ఆర్టికల్ 30(1) ప్రకారం ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. 

ఉమ్మడి రాష్ట్రంలో 2011 నుంచి అమలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో జీవో నంబర్14 జారీ చేస్తూ బాల, బాలికల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది.  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో నూటికి నూరు శాతం 6 నుంచి14 సంవత్సరాల మధ్య వయసుగల విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య నుంచి సెకండరీ విద్య వరకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇందులో అనాథ, ఎయిడ్స్ బాధిత పిల్లలకు 5 శాతం, షెడ్యూల్డ్ కులాల వారికి10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 4 శాతం, సామాజికంగా, విద్యా పరంగా వెనకబడిన తరగతులు, అగ్రకులాల్లోని నిరుపేదలకు, మైనారిటీలకు కలిపి వార్షిక ఆదాయపరిమితి నిబంధనతో 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

గురుకులాలతో..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు గురుకులాల ద్వారా విద్య నందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా..  ఈ విద్యాలయాల్లో సుమారు 5 శాతం విద్యార్థులకు మాత్రమే అరకొర వసతులతో విద్య అందుతోంది. మిగతా 95 శాతం మంది విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల మాదిరిగా తెలంగాణ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో పక్కా భవనాలు, కనీస వసతులు, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయులను నియమించాలి. అప్పుడే అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగం నిర్దేశించినట్లు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25 శాతం రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల, బాలికలకు నాణ్యమైన విద్య అందేలా చేయాలి. రాష్ట్రంలో 2020–-21 అకడమిక్​ ఇయర్​లో కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం నెలకు రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ప్రత్యేక, అభివృద్ధి, నిర్వహణ తదితర వాటి పేరుమీద అడ్డగోలు ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయాలి. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణతో ఉన్నత విద్యను కూడా ఆర్టికల్ 21ఎలోకి తెచ్చి ఉచిత విద్యాహక్కు చట్టంలో చేర్చాలి.

తగ్గిపోతున్న సర్కార్​ బడులు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40,900 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.  ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 70 శాతం,  ప్రైవేటు పాఠశాలలు 30 శాతం నడుస్తున్నవి. విద్యార్థుల అడ్మిషన్లను ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే  ప్రైవేటు బడుల్లోనే 52 శాతం అధికంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఇంచు మించు సమానంగా ఉంటోంది.  ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదని అనేక ఆరోపణలు ఉన్నాయి.  ఒకవైపు సర్కారు స్కూళ్ల సంఖ్య తగ్గుతుండగా,  ప్రైవేటు విద్యా సంస్థలు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు1992లో మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  కేసుల తీర్పుల్లో ఆర్టికల్ 21 ప్రకారం విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించి,  ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యను వ్యాపారంగా చూడరాదని ఆదేశించింది.

కోడెపాక కుమారస్వామి,సోషల్ ఎనలిస్ట్