మానవ ప్రగతికి విద్య ఎంతగానో దోహదపడుతుంది. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాల్లో అతి ముఖ్యమైనది బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం. ఇది దేశ ప్రగతిలో ఒక మైలురాయి. ఈ చట్టం బడిఈడు పిల్లలందరూ బడిలో చేరి పూర్తికాలం కొనసాగి తరగతి స్థాయిని సాధించడం లక్ష్యంగా రూపుదిద్దుకున్నది. బడి అంటే పిల్లల చదువుకు సంబంధించిన అంశమే కాకుండా పిల్లలు ఉండాల్సిన చోటు, వారి సర్వతోముఖాభివృద్ధికి అవకాశం కల్పించేదిగా విద్యావేత్తలు అభివర్ణించారు. విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోని బడులన్నీ ఈ చట్ట పరిధికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. పాఠశాల విద్యాలక్ష్య సాధనలో, ప్రగతి సాధనలో విద్యాహక్కు చట్టం తోడ్పడుతుంది. విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించి చట్టాలు చేసిన దేశాలలో మన దేశం కూడా చేరింది.
స్వరాష్ట్రంలో చొరవ ఏది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చట్టం సక్రమ అమలుకు ప్రభుత్వం చొరవ చూపలేదు. 6 నుంచి14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సి ఉన్నా, గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య నేటికీ అందడం లేదు. చట్టంలోని సెక్షన్ 12 విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 శాతం రిజర్వషన్లు కల్పించాలని నిర్దేశించింది. ఆ దిశగా ప్రభుత్వం నేటికీ చర్యలు చేపట్టలేదు. చట్టంలోని సెక్షన్13 ననుసరించి బడుల్లో ప్రవేశాలకు ఎంపిక విధానం, క్యాపిటేషన్ ఫీజుల వసూలు నిషిద్ధం. కానీ నేడు చాలా కార్పోరేట్ స్కూళ్లలో క్వాలిఫయింగ్ టెస్టుల పేర్లతో లక్షలకు లక్షలు డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరం. సెక్షన్ 25, 26 ననుసరించి చట్టం అమలులోకి వచ్చిన 6 నెలలలోపు విద్యార్థి, టీచర్ల నిష్పత్తిని ప్రతి బడిలోనూ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలి, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి, ఏటా టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకే ఒకసారి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టడం గమనార్హం. ఉపాధ్యాయ ఖాళీలు10 శాతానికి మించకూడదని చట్టం చెబుతున్నా, చాలా బడుల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండి బోధన సజావుగా సాగడం లేదు. ఇలా చట్టంలోని ప్రతి సెక్షన్ పిల్లలకు ప్రయోజనాన్ని చేకుర్చేదే. ఉపాధ్యాయులకు 7 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లు ఇవ్వకుండా, 5 సంవత్సరాలకు పైగా బదిలీలు చేపట్టకుండా విద్యావ్యవస్థను నడపడం ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చట్టం అమలుకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. క్షేత్రస్థాయిలో చట్టం అమలు తీరు పర్యవేక్షణకు టీమ్లను ఏర్పాటు చేయాలి. చట్టంలోని అంశాలను అవగాహన కల్పించడానికి అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. చట్టం పట్ల తల్లిదండ్రులకు, గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడే పిల్లలందరికీ చట్టంలోని ఫలాలు అందుతాయి.
చట్టం తెచ్చి 12 ఏండ్లు గడిచినా..
విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి పుష్కర కాలం గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదన్నది అక్షర సత్యం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చట్టం అమలు ప్రహసనంగా మారింది. నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రగల్భాలు పలికిన పాలకులు అమలులో మాత్రం చిత్తశుద్ధి కనబరచలేకపోతున్నారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో రూపుదిద్దుకున్న ఈ చట్టం అమలుకు అందనంత దూరంలో ఉందనడంలో సందేహం లేదు. చదువుకోవాలనే కోరిక గల ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా తెచ్చిన చట్టం పకడ్బందీగా అమలు జరగడం లేదన్నది అంగీకరించాల్సిన నిజం. ఈ చట్టాన్ని పార్లమెంట్ 2009 జులై 20న ఆమోదించగా 1 ఏప్రిల్ 2010 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలుపరుస్తున్న దేశం చీలి. మొత్తం135 దేశాల్లో ఈ చట్టం అమలౌతున్నది. భారతదేశంలో ఈ చట్టాన్ని ఉత్తర ప్రదేశ్ మొట్టమొదటగా అమలుపరిచింది.
- ఏవీ సుధాకర్,అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్